"ఎందెందు వెతికినా.. సంగీతం అందులేదని సందేహం వలదు!" అని నిరూపిస్తున్నారు ఓ సంగీత ప్రేమికుడు. మనకు పనికిరాని ప్రతి వస్తువులోనూ ఓ సంగీత వాద్యం దాగి ఉందంటున్నారు. అవి సప్తస్వరాలను పలికిస్తాయని నిరూపిస్తున్నారు. ఆయనే బంగాల్‌కు చెందిన సోమనాథ్ బందోపాధ్యాయ. పనికిరాని వ్యర్థాలతో జిలోఫోన్ అనే సంగీత వాద్యాన్ని రూపొందించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు సోమనాథ్.
హుగ్లీ జిల్లాలోని శ్రీరామ్పొరకు చెందిన సోమనాథ్.. ప్రసిద్ధ వాద్యకారుడు నిరద్ బారన్ బందోపాధ్యాయ కుమారుడు. చెక్క వాద్యాలు వాయించే విషయంలో సీనియర్ బందోపాధ్యాయ దిట్ట! పండిత్ రవిశంకర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
దైనందిన జీవితంలో శృతి, లయలు దాగి ఉన్నాయని భావించే సోమనాథ్.. రోజువారీ వ్యర్థాల్లో కూడా అవి ఉంటాయని విశ్వసిస్తారు. 2016లో తన ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడు.. టైల్స్ ధ్వనిలో దాగి ఉన్న లయను సోమనాథ్ గుర్తించారు. ఆ స్ఫూర్తితోనే తన అద్భుతమైన సృజనకు పదును పెట్టారు. టైల్స్‌తో జిలోఫోన్ అనే సంగీత వాద్యాన్ని రూపొందించారు.
"టైల్స్ కిందపడిన శబ్దం విని షాకయ్యాను. మరోసారి దానిని కిందవేయమని మాసన్‌ను(తాపీ పనివాడు) అడిగాను. అతను ఆశ్చర్యపడ్డాడు. అది మొదలు.. టైల్స్ వ్యర్థాలతో సంగీత వాయిద్యాలు చేయడం ప్రారంభించాను. వీటి తయారీ కోసం ప్రత్యేకమైన మట్టిని.. బన్గావ్ నుంచి తెప్పిస్తున్నాను."
- సోమనాథ్ బందోపాధ్యాయ, సంగీత కళాకారుడు
టైల్స్తోనే కాకుండా.. సాస్ బాటిల్స్ వంటి వ్యర్థాలతో కూడా సంగీత పరికరాలను తయారు చేశారు సోమనాథ్.
"డంప్‌యార్డ్ సహా పలు ప్రాంతాల నుంచి ఎన్నో పాత సీసాలను సేకరించాను. అయితే వాటిలో నేను కోరుకున్న సంగీతాన్ని వినలేకపోయాను. చివరగా.. పాత సాస్ బాటిల్ నుంచి మధురమైన సంగీతం వినిపించింది."
- సోమనాథ్ బందోపాధ్యాయ, సంగీత కళాకారుడు
సోమనాథ్ సహా ఆయన అన్నయ్య నారాయణ్ బందోపాధ్యాయలు.. చిన్నప్పటి నుంచే తండ్రి తయారు చేసిన ప్రత్యేకమైన వాద్యాల పట్ల ఆకర్షితులయ్యారు. తన కుమారులను ప్రోత్సహించడానికి.. వెదురుతో వాద్యాలను తయారు చేసేవారు సీనియర్ బందోపాధ్యాయ.
చదువుకునే రోజుల్లో.. తన వాద్యాలకు సోమనాథ్ పని చెప్పేవారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా.. సంగీత పరికరాల తయారీపై సోమనాథ్ ఆసక్తి చూపలేకపోయారు. అయినప్పటికీ సంగీతంపై ఉన్న మక్కువను మాత్రం వదులుకోలేదు.
ఆయన వారసత్వాన్ని ఇప్పుడు తన కుమారుడుకి అందించాలని సోమనాథ్ భావిస్తున్నారు.