బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేయనున్న సువేందు అధికారి నందిగ్రామ్ భాజపా అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు తృణమూల్‌ను వీడి భాజపాలో చేరిన సువేందు.. నామినేషన్ సందర్భంగా భారీ బలప్రదర్శన చేశారు.
నామినేషన్ అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సువేందు. తృణమూల్ కాంగ్రెస్ ప్రైవేటు కంపెనీగా మారిందని ఆరోపించారు. టీఎంసీలో కేవలం దీదీ, ఆమె అల్లుడు మాత్రమే స్వేచ్ఛగా మాట్లడగలరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని.. అభివృద్ధి జరగాలంటే మమతను ఓడించాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజల దీవెనలు నాతోనే ఉన్నాయని నమ్ముతున్నా. ఈ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు మద్దతుగా నిలిచి.. బంగాల్కి నిజమైన అభివృద్ధిని ఆహ్వానిస్తారు. మాకు ఎవరు పోటీ అన్నదానిపై అసలు ప్రశ్నే లేదు.
-సువేందు అధికారి, భాజపా నేత
2019 లోక్‌సభ ఎన్నికల్లో 18పార్లమెంటరీ స్థానాల్లో భాజపా గెలుపొందిందని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు జోస్యం చెప్పారు.
అంతకముందు నందిగ్రామ్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించారు. దీదీకి పార్టీ కార్యకర్తలు ఐదేళ్లకొకసారి మాత్రమే గుర్తొస్తారని.. కానీ వారితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని సువేందు చెప్పారు. తమ బంధం చాలా పాతదని తెలిపారు. మమతను తన అభిమానులే ఓడిస్తారన్నారు. తాను నందిగ్రామ్ ఓటరు అని సువేందు పునరుద్ఘాటించారు.