Balineni Angry on YSRCP Leadership: వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి శుక్రవారం ఒంగోలు రానున్నారు. కొండపి, సంతనూతలపాడు నూతన సమన్వయకర్తలను కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన పర్యటన పైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉండగా.. పార్టీకి జిల్లాలో అన్నీ తానై ఉండే బాలినేని అందుబాటులో లేరు. తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. తన తనయుడు ప్రణీత్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఓ థియేటర్లో పాప్‌కార్న్ తింటూ 'గుంటూరు కారం' సినిమాను వీక్షిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
వైసీపీలో టికెట్‌లపై రాని స్పష్టత - వేర్వేరుగా ఉన్న పార్టీ, నేతల ఆలోచనలు
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మళ్లీ అధికారమే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నట్లు అధిష్ఠానం భావిస్తున్నా అంగబలం కలిసిరావడం లేదనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. అభ్యర్థుల మార్పు, సమన్వయకర్తల నియామకం నేపథ్యంలో అధినేత ఆదేశాలు, అభ్యర్థుల అలకలు తదితర సన్నివేశాలు పరిస్థితులను రక్తికట్టిస్తున్నాయి. 'అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో' అనే సినిమా డైలాగులు గుర్తొస్తున్నాయి.
తీవ్ర అసంతృప్తి : అధిష్ఠానం తన డిమాండ్లను పట్టించుకోకపోగా, తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం బాలినేనిలో అసంతృప్తిని రగిల్చింది. ఇవాళ్టి సమావేశానికి ఆయన దూరంగా ఉండడానికి అదే కారణమని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని తన తనయుడు ప్రణీత్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఓ థియేటర్లో పాప్‌కార్న్ తింటూ గుంటూరు కారం సినిమాను వీక్షిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలినేని తదుపరి నిర్ణయం ఏమిటనే విషయమై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. పలువురు నాయకులు, కార్యకర్తలు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిదీ అదే పరిస్థితి.
ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా
ఏక్షణాన ఏం జరిగేనో : కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలుగా అధిష్ఠానం మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునను నియమించింది. ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలకు వారిని పరిచయం చేయాలనేది విజయసాయిరెడ్డి పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశంపై బాలినేనికి గురువారమే సమాచారమిచ్చినా, అప్పటికే అధిష్ఠానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తాను హాజరయ్యేది లేదని ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏక్షణాన ఏం జరుగుతుందో అని టెన్షన్ వాతావరణం నెలకొంది.
బాలినేనికి అధిష్ఠానం ఝలక్ : 'బాలినేని వస్తానంటే ఇబ్బందేమీ లేదు. మాగుంటకైతే మాత్రం అవకాశమే లేదు. ఆ అంశం కాకుండా ఇంకేమైనా మాట్లాడండి..'’ ఇదీ ప్రస్తుతం వైసీపీ అధిష్ఠానం అనుసరిస్తున్న విధానం. ఇక 'ఒంగోలులో ఇళ్ల స్థలాల కోసం రూ.170 కోట్లు మంజూరు చేయాలి. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ స్థానం ఖరారు చేయాలి. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో తాను సూచించిన అభ్యర్థులకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలి'. ఇవీ బాలినేని ప్రధాన డిమాండ్లు. వీటిలో ఏ ఒక్కటీ అధిష్ఠానం ఖాతరు చేయలేదు. సరికదా.. అదే సమయంలో తాను చెక్ పెట్టాలనుకున్న తన బావ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పెద్దల సభ సీటు ఖరారు చేసింది. మాగుంటను పూచిక పుల్లలా పక్కనపెట్టేసి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ స్థానం దాదాపు ఖరారు చేసింది. వీటన్నింటికీ మించి మూడు రోజులు విజయవాడలో వేచి చూసినా, వివిధ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కలుస్తున్నా తనకు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకోలేదు. జిల్లాలో పార్టీకి పెద్దన్నలాంటి మాజీ మంత్రి బాలినేనికి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకోవటం లేదనే ఆలోచన ఆయన అనుయాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొండపి సమావేశానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఆయనతో సన్నిహితంగా మెలిగే అనుచర వర్గాన్ని ఆహ్వానించకపోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై జగన్ కసరత్తు - నేతలలో ఉత్కంఠ
వైసీపీని ఓడించి తీరుతాం : జిల్లాలో మూడు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో మార్పులతో పాటు మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి చూపారు. మరో ఎమ్మెల్యేకు కూడా ఝలక్ తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ బీ-ఫారం తీసుకునైనా వైసీపీ అభ్యర్థిని ఓడించి తీరుతానని ఓ ఎమ్మెల్యే అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శుక్రవారంనాటి సమావేశానికి బాలినేని రాకుంటే తాను హాజరవ్వాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. టికెట్ రాదన్న సమాచారంతో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు వినికిడి.
ఇన్‌ఛార్జ్‌ల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు - సీఎంవోకు క్యూ కట్టిన నేతలు