Jatindranath Mukherjee: యుగాంతర్ పార్టీకి చెందిన జతీంద్రనాథ్ ముఖర్జీ.. దేశంలో విప్లవం లేవదీసి, ఆంగ్లేయులను తరిమికొట్టాలనే పట్టుదలను ప్రదర్శించేవారు. అందులో భాగంగానే బెంగాల్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు యుగాంతర్ శాఖలను విస్తరించారు. ఉద్యమాన్ని నడిపేందుకు డబ్బుల అవసరం పెరగడం వల్ల వివిధ ప్రాంతాల్లో బ్రిటిషర్లకు అనుకూలంగా ఉండే ధనవంతులను దోచుకున్నారు. ఆయుధాలుంటే సులభంగా యుద్ధం చేయవచ్చనే ఆలోచనతో అప్పట్లో.. జర్మనీ నుంచి వచ్చిన మార్క్సిస్టు నేత ఎం.ఎన్.రాయ్‌ని అభ్యర్థించారు. మూడు ఓడల్లో ఆయుధాలు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చినా.. దురదృష్టవశాత్తు తొలి ప్రపంచ యుద్ధం కారణంగా సాధ్యపడలేదు. దాంతో సొంతంగానే ఆయుధాల తయారీని ప్రారంభించారు. అయితే.. తుపాకుల తయారీలో నిపుణులైన కార్యకర్తలు వివిధ సందర్భాలలో పోలీసులకు చిక్కడం వల్ల వారి ప్రయత్నం ఆగిపోయింది. ఇక దేశీయంగానే సేకరించాలనే లక్ష్యంతో సైనికులను సంప్రదించినా ఫలితం కనిపించలేదు.
ఎడ్లబండితో వెళ్లి.. ఏమార్చి: కోల్‌కతాలో అప్పట్లో పేరెన్నికగన్న తుపాకుల విక్రయ కేంద్రం రొడ్డ అండ్ కంపెనీ. అందులో అనుశీలన్ సమితికి చెందిన కార్యకర్త శిరీశ్ చంద్రమిత్ర పని చేసేవారు. జర్మనీ తుపాకులు, బుల్లెట్లు భారీగా దిగుమతి అవుతున్నాయని తెలుసుకుని విప్లవకారులకు ఉప్పందించారు. వెంటనే యుగాంతర్ పార్టీకి చెందిన అనుకూల్ ముఖర్జీ ఆధ్వర్యంలో కలకత్తా శివారులో 1914 ఆగస్టు 24న కలుసుకుని, రెండు రోజుల తర్వాత ఆయుధాలను దోపిడీ చేయాలని నిర్ణయించారు. కోలకతాలోని కస్టమ్స్ హౌజ్ నుంచి ఆయుధాలను తీసుకురావడానికి ఆగస్టు 26న కంపెనీ తరఫున శిరీశ్ చంద్రమిత్ర ఆధ్వర్యంలో ఏడు ఎద్దుల బండ్లలో వెళ్లారు. వారిలో యుగాంతర్‌కు చెందిన హరిదాస్ దత్త అనే కార్యకర్త చేరిపోయారు. ఆయనకు సహాయకంగా శ్రిశ్‌పాల్, ఖగేంద్రనాథ్ దాస్ ఉన్నారు. మొత్తం 202 పెట్టెలు ఉండగా కంపెనీ సిబ్బంది 192 పెట్టెలను ఆరు బండ్లలో సర్దారు. హరిదాస్ దత్త నడుపుతున్న చివరి బండిలో పదింటిని పెట్టారు. బండ్లన్నీ కంపెనీ గోదాముకు బయలుదేరగా మార్గమధ్యంలో దత్త తన బండిని తప్పించారు. కోల్‌కతా శివారులో యుగాంతర్ సభ్యులకు.. 50 తుపాకులు, 46 వేల రౌండ్ల బుల్లెట్లున్న పది పెట్టెలను అప్పగించారు. ఈ తుపాకులు, గుళ్లనే 1917 వరకు బెంగాల్‌లో జరిగిన వివిధ రాజకీయ హత్యలు, బెదిరింపుల సంఘటనల్లో.. విప్లవ సంస్థల ప్రతినిధులు ఉపయోగించారు. ప్రభుత్వం గుండెల్లో నిద్రపోయారు.
బ్రిటిషర్ల ఎనిమిదేళ్ల వేట: ఆయుధాల దోపిడీపై స్టేట్స్‌మన్ పత్రిక ఆగస్టు 30న 'ది గ్రేటెస్ట్ డేలైట్ రాబరీ' అనే శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. పోలీసులు హరిదాస్ దత్త, కాళిదాసు బసు, భుజంగ ధార్, గిరీంద్రనాథ్ బెనర్జీలను పట్టుకుని, అందరికీ జైలుశిక్ష విధించారు. ప్రభుత్వం ఏకంగా ఎనిమిదేళ్లపాటు దర్యాప్తును కొనసాగించి, దోపిడీ అయిన ఆయుధాలను అన్నింటినీ దాదాపుగా తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే.. దోపిడీలో కీలకంగా వ్యవహరించిన శిరీశ్‌మిత్ర చివరివరకు దొరక్క పోవడం వల్ల పోలీసులు పక్కాగా కేసు నమోదు చేయలేకపోయారు. దాంతో ఎవరికీ జీవితఖైదులు, మరణశిక్షలు విధించలేకపోయారు.
బిర్లా ఇంట్లోనూ సోదాలు: కోల్‌కతా బారాబజార్‌లోని బిర్లాల నివాసంలో సైతం 1916 జులై 21న పోలీసులు సోదాలు చేశారు. విప్లవకారులు ఆయుధాల పెట్టెను వారం రోజులపాటు బిర్లా నివాసంలోనే దాచిపెట్టారని, అప్పట్లో 22 ఏళ్ల వయసున్న జి.డి.బిర్లా (ఘనశ్యాం దాస్ బిర్లా) వారికి సహకరించారనే అనుమానంతో ఈ తనిఖీలు చేశారు. అదృష్టవశాత్తు ఆయన ఇంట్లో లేకపోవడం వల్ల వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: పుల్లరిపై పల్నాటి బహిష్కరణ బాణం.. నీళ్లు కూడా దొరకకుండా చేసి..