కర్ణాటకలో బెంగళూరులో 200 మంది ప్రాణాలను కాపాడారు కరోనా యోధులు. నగరంలోని కేసీ జనరల్ ఆస్పత్రిలో 200 మంది కరోనా రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. క్రమంగా ఆక్సిజన్ తగ్గిపోవడం మొదలైంది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్య సిబ్బంది.. రాత్రి 11 గంటలకు ప్రొక్సీ కంపెనీకి ఫోన్ చేసి, ఆక్సిజన్ సరఫరా చేయమని కోరారు. బళ్లారి నుంచి ఓ ట్యాంకర్‌ను పంపింది ఆ సంస్థ. అయితే రాత్రి 11.30 గంటలైనా ఆ ట్యాంకర్ రాలేదు. దురదృష్టవశాత్తూ.. కేసీ ఆస్పత్రికి రావాల్సిన ట్యాంకర్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిపోయింది. మరోవైపు ఆక్సిజన్ తగ్గిపోయింది.

రంగంలోకి డిప్యూటీ సీఎం
దీంతో ఆస్పత్రిలో ఆక్సిజన్ నిర్వహణ ఇన్‌ఛార్జి డాక్టర్ రేణుకా ప్రసాద్‌కు సమాచారం అందించారు సిబ్బంది. ఆయన మరోసారి ప్రొక్సీ కంపెనీకి ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఉపముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వంత్ నారాయణ్‌కు ఫోన్ చేశారు ప్రసాద్. రంగంలోకి దిగిన డీసీఎం ఎక్కడెక్కడ ఆక్సిజన్ అందుబాటులో ఉందో తెలుసుకుని.. చివరకు యూనివర్సల్ కంపెనీ నుంచి ప్రాణవాయువు సరఫరా చేసే ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించి.. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అతివేగంగా జంబో ఆక్సిజన్ సిలిండర్లు ఆస్పత్రికి చేరుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
దీంతో తెల్లవారుజామున 4.45 గంటలకు ప్రాణావాయువు ఆస్పత్రికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది మొత్తం ఆ వార్డుకు చేరుకుని.. రోగులకు ఆక్సిజన్ అందించారు. అంతా సర్దుమణిగాక ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: వైద్యం వికటించి ఎనిమిది మంది మృతి