అసోంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భాజపా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో 86 స్థానాల్లో పోటీపై భాజపా, అసోం గణపరిషత్, యూనైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రంజిత్ దాస్ వెల్లడించారు. అయితే కూటమిలో అంతర్గత కారణాల వల్ల ఏ పార్టీకి ఎన్ని సీట్లని వెల్లడించటం లేదన్నారు.
మార్చి 27న మొదటి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో తమ అభ్యర్థుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇంకో 12 స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత రాలేదని.. అందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నారు. ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్నే సీఎం అభ్యర్థిగా అన్న ప్రశ్నకు దాస్ స్పందించారు. సొంత ప్రభుత్వం ఉన్నచోట.. సీఎం అభ్యర్థిని తాము ప్రకటించమన్నారు.
అసోంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మార్చి 9న ముగియనుంది. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మార్చి 12, మూడో విడత మార్చి 19న ముగియనుంది.
బోడో పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్).. 2016 ఎన్నికల్లో భాజపా కూటమిలో ఉంది. ఆ ఎన్నికల్లో బీపీఎఫ్ 12 సీట్లు సాధించింది. అయితే ఈ సారి భాజపా కూటమి వీడి కాంగ్రెస్ జట్టు కట్టింది బీపీఎఫ్.
ఇదీ చదవండి : అసోం మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఇదీ చదవండి : బంగాల్లో 20, అసోంలో 6 భారీ ర్యాలీలకు మోదీ!
ఇదీ చదవండి : భాజపాతో కటీఫ్.. బీపీఎఫ్ ప్రకటన