ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ నూతన హంగులతో ముస్తాబవుతోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో మూతపడిన ప్రేమసౌధానికి భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఆధ్యర్యంలో మరమ్మతులు జరుగుతున్నాయి. 'మడ్‌ప్యాక్' విధానంలో కొన్నేళ్లుగా పాలరాతి పలకలపై ఉన్న పచ్చని మరలకను తొలగించడమే కాకుండా శిథిలావస్థకు చేరిన గోపురం, మినార్లు, ద్వారాలను బాగు చేయించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. పరిస్థితులు చక్కపడిన తర్వాత వచ్చే సందర్శకులకు తాజమహల్‌ను సరికొత్తగా చూపించేందుకు కరోనా ఆంక్షల సమయాన్ని ఊపయోగించుకుంటోంది ఏఎస్ఐ.
కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని వారసత్వ కట్టడాల సందర్శనను ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వరకు నిలిపేసింది భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ). ఇందులో భాగంగా తాజమహల్‌ను కూడా తాత్కాలికంగా మూసివేసింది.
గత 13 నెలల్లో ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని మూసివేయడం ఇది రెండోసారి. మొదటి దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 17న మొదటిసారి సందర్శనను నిలిపివేసింది ఏఎస్ఐ. ఆ తర్వాత కేసులు తగ్గడం వల్ల 2020 సెప్టెంబర్ 21న తిరిగి టూరిస్టులకు అనుమతి ఇచ్చారు.
ఏమిటి ఈ 'మడ్‌ప్యాక్' విధానం?
చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేసేటప్పుడు, వాటి సహజ సౌందర్యం పోకుండా ఉండటానికి భారత పురావస్తు శాఖ ఎక్కువగా 'మడ్‌ప్యాక్' విధానాన్ని ఎంచుకుంటుంది.
మడ్‌ప్యాక్ విధానంలో ముల్తానీ మట్టిని వినియోగిస్తారు. ఆ మట్టి పేస్ట్‌ను రాతిపై పూసి.. నీటితో కడుగుతారు. శుభ్రపరచడంలో రసాయనం ఉపయోగించకపోవడం వల్ల రాయికి ఎలాంటి నష్టం జరగదు. ఫలితంగా ఆ రాయి తన సహజ అందాన్ని తిరిగి పొందుతుంది. ఈ విధానాన్ని తాజమహల్ విషయంలో ఇది వరకు కూడా ప్రయోగించారు.
ప్రధాన మరమ్మతులు ఇవే..
మడ్‌ప్యాక్ విధానంలో తాజ్‌మహల్ కాంప్లెక్స్‌లోని రాయల్ గేట్, గోపురాలు, మినార్లకు మరమ్మతులు చేయనున్నారు. ప్రధానంగా వాటిపై ఉండే పచ్చటి మచ్చలను తొలగించనున్నారు. ప్రధాన గోపురానికి మరిన్ని నగిషీలు చెక్కనున్నారు. ప్రస్తుతం నైరుతిలో ఉండే మినార్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం దాదాపు రూ. 19లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఆర్కియాలజిస్ట్ వసంత్ కుమార్ స్వర్ణకర్ తెలిపారు. మూసివేసిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని.. తాజమహల్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. తద్వారా పర్యటకులకు మరింత అనుభూతిని పంచాలని పురావస్తు అధికారులు భావిస్తున్నారు.
"మరమ్మతులతో తాజ్‌మహల్ సరికొత్త శోభను సంతరించుకుంటుంది. కరోనా పరిస్థితులు చక్కపడిన తర్వాత వచ్చే పర్యటకులు చూసి.. 'వహ్.. తాజ్' అనాల్సిందే. చారిత్రక కట్టడాల పరిరక్షణకు పురావస్తు శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం. గతేడాది లాక్డౌన్ సమయంలో కూడా రైల్వేశాఖ.. ట్రాక్‌ల మరమ్మతులను ఇలాగే పూర్తి చేసింది."
-రాజీవ్ సక్సేనా, ఆగ్రా పర్యటక సమాఖ్య ఉపాధ్యక్షుడు
రాయల్ గేట్
తాజ్‌మహల్ ప్రధాన ద్వారాన్ని రాయల్ గేట్గా పిలుస్తారు. ఆ ద్వారాన్ని ఎన్నో ప్రత్యేకలతో నిర్మించారు షాజహాన్. రంగు రాళ్లు పొదిగిన ఆ గేటు.. తాజ్‌మహల్‌కు ప్రత్యేక ఆకర్షణ. అయితే ఇప్పుడు ఆ రాళ్లు అరిగిపోయాయి.. అందాన్ని కోల్పోయాయింది రాయల్ గేట్. దీంతో ప్రస్తుతం ఆ గేటుకు కొత్త రంగు రాళ్లను అమర్చే పనులు కూడా జరుగుతున్నాయి.
మినార్ల మడ్ప్యాక్కు రూ.23లక్షలు..
తాజ్‌మహల్ గురించి చర్చిస్తే.. దానికి నాలుగు వైపుల ఉండే మినార్ల గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. స్తంభాల నిర్మాణానికి పాలరాయిని వినియోగించారు షాజహాన్. అందుకే అవి చాలా అందంగా కనిపిస్తాయి.
నాలుగు మినార్ల మరమ్మతులకు భారత పురావస్తు శాఖ రూ. 23లక్షలు వెచ్చిస్తోంది. ఈ మొత్తంతో స్తంభాల్లో అరిగిన రంగు రాళ్లను తొలగించి.. కొత్తవి అమర్చనున్నారు. అలాగే మరమ్మతు పనులు చేయనున్నారు. ప్రస్తుతం నైరుతిలో ఉన్న మినార్ పనులు జరుగుతున్నాయి.
ఆ పనులే పెద్ద టాస్క్..
తాజ్‌మహల్ ప్రధాన గోపురానికి మడ్‌ప్యాక్ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. గోపురం మధ్య భాగంలో హారంలాగా ఉండే.. వరుసలో ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన రంగు రాళ్లను అమర్చాల్సి ఉంటుంది.
ఈ పనులు పూర్తయితే తాజ్‌మహల్ మరింత ప్రకాశవంతంగా పర్యటకులకు దర్శమిస్తుందని వసంత్ కుమార్ స్వర్ణకర్ అభిప్రాయపడ్డారు.
కరోనా వేళ చేపడుతున్న పనులు కావడం వల్ల.. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
రాజా తోడర్ మల్ బరదారీ రక్షణ
తోడర్ మల్.. మొఘల్ చక్రవర్తి అక్బర్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు. అక్బర్ కాలంలో కీలకమైన వ్యక్తి అయిన తోడర్ మల్ చెందిన 'బరదారీ' సంరక్షణ చర్యలు చేపట్టింది పురావస్తు శాఖ. ఈ బారదరీని ఇంతకుముందు నిర్లక్ష్యం చేశారు. కాగా అక్కడ చేపట్టిన తవ్వకాల్లో సుమారు 450 సంవత్సరాల పురాతనమైన ఒక జలాశయం బయటపడింది.
ఆ జలాశయం నిర్మాణం ఎంతో అద్భుతమైనది. దాని ప్రతి గోడపై తొమ్మిది రకాల నమూనాలు ఉన్నాయి. దాని ఫౌంటెన్ ఎర్ర ఇసుకరాయితో ఉంటుంది. ఫౌంటెన్ నిర్మాణంలో ఉపయోగించిన లోహం ఏంటి అనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది.