Maharashtra CM Resign : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన వెంట బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని శిందేను గవర్నర్ కోరారు.
#WATCH | Maharashtra CM Eknath Shinde tenders his resignation as CM to Governor CP Radhakrishnan, at Raj Bhavan in Mumbai
— ANI (@ANI) November 26, 2024
Deputy CMs Ajit Pawar and Devendra Fadnavis are also present.
Mahayuti alliance consisting BJP, Shiv Sena and NCP emerged victorious in Maharashtra… pic.twitter.com/RGUl6chZOS
మహారాష్ట్ర 14వ శాసనసభ గడువు మంగళవారంతో ముగియనుండటం వల్ల ఏక్‌నాథ్ శిందే రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను 234 స్థానాలతో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది. అందులో బీజేపీ 132స్థానాలు గెలుపొందగా, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లల్లో విజయం సాధించాయి. కొత్తప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కవచ్చు. అయితే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం అంటుండగా, ఏక్‌నాథ్ శిందేనే కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మరింత ఆలస్యం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
'సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ తొందరపడదు'
ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వానికి సంబంధించి శాఖల కేటాయింపు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో బీజేపీ తొందర పడదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికను రూపొందించడమే ఇప్పుడు ఉన్న ప్రాధాన్యతని, అందులోనే మంత్రిత్వ శాఖలు, కీలక పదవుల కేటాయింపులు కూడా ఉన్నాయని బీజేపీ నేత పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ- మహారాష్ట్రకు పరిశీలకులను పంపించే యోచనలో ఉందని అన్నారు. వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమవుతారని, ఆ తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయించి ప్రకటిస్తారని తెలిపారు.
సీఎం అభ్యర్థిని మంగళవారం రాత్రి లేదా బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు శివసేన నేత సంజయ్ శిర్సాట్ తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలతో చర్చించిన తర్వాతే శిందే, ఫడణవీస్, అజిత్ పవార్ ముగ్గురు మంగళవారం సాయంత్రం సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
'వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకోలేరు'
మరోవైపు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కావచ్చని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ అభిప్రాయపడ్డారు. ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్‌లు తమ పార్టీల కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని సంజయ్ రౌత్ అన్నారు. ఆ రెండు పార్టీలు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా కనుసన్నల్లోనే నడుస్తాయని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీ సాధించడం వల్ల వారికి అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.