వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సింఘు సరిహద్దులో చేస్తున్న వీరి నిరసనలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. రిలే నిరాహారదీక్షలు ప్రారంభించినట్లు ప్రకటించాయి. ధర్నా చేస్తున్న ప్రాంతాల్లోనే 24 గంటల పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్న రైతు సంఘాల నేతలు తెలిపారు. ప్రతిరోజు 11 మంది రైతులు నిరాహార దీక్షలో పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ కార్యదర్శి బల్వంత్ సింగ్ వెల్లడించారు.
నిరసనల్లో భాగంగా రైతు సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. రైతులకు మద్దతుగా ఈనెల 23న ఒక్కపూట ఉపవాసం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ నెల 25-27 వరకు హరియాణాలో రోడ్ సుంకం వసూలు అడ్డుకుంటామని తెలిపాయి. ఈ నెల 27న ప్రధాని మన్‌కీ బాత్ కొనసాగే సమయంలో పాత్రల చప్పుడు చేయాలని పిలుపునిచ్చాయి.
కాగా, రైతు సంఘాలను మరో దఫా చర్చలకు కేంద్రం ఆహ్వానించింది. చర్చలకు అనుకూలమైన తేదీని నిర్ణయించాలని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి లేఖ రాశారు. కేంద్రం ఆహ్వానంపై నేడు రైతు సంఘాలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి.
ఇదీ చదవండి: పుస్తకాలపై ప్రేమతో ఇంట్లోనే 'బుక్‌హౌజ్'