రామ జన్మభూమి తీర్థ క్షేత్ర... దశాబ్దాలుగా నలిగిన అయోధ్య సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చెప్పిన అనంతరం రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇది. ఇప్పుడా ట్రస్ట్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. భూమి కొనుగోలు విషయంలో ట్రస్ట్ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్ వాదీ పార్టీ నేత పవన్ పాండే.. ఈ మేరకు ఆదివారం వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో పాల్గొని ఈ ఆరోపణలు చేశారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్త చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏంటీ ట్రస్ట్?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో మందిర నిర్మాణం కోసం 'శ్రీరామ మందిర తీర్థ క్షేత్ర' పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసింది కేంద్రం. ట్రస్ట్‌పై గతేడాది ఫిబ్రవరి 5న పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. వివాదం కొనసాగిన 2.77 ఎకరాలతో పాటు మిగతా 67.703 ఎకరాల భూమిని ఈ ట్రస్ట్‌కు అప్పజెప్పింది కేంద్రం. 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్ట్.. మందిర నిర్మాణం సహా సంబంధిత విషయాలపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మహంత నృత్యగోపాల్ దాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ప్రస్తుత వివాదం
అయోధ్యలోని బాగ్ జైసీ గ్రామంలో 1.208 హెక్టార్ల భూమి కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందన్నది విపక్ష నేతల ఆరోపణ. రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ట్రస్ట్.. రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
కుసుమ్, హరీశ్ పాఠక్ అనే వ్యక్తుల నుంచి రవి మోహన్, సుల్తాన్ అన్సారీ ఆ భూమిని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారని, అది జరిగిన ఐదు నిమిషాలకే వారి నుంచి ట్రస్ట్ కొనుగోలు చేసిందని సంజయ్ సింగ్ వివరించారు. ఇందుకోసం రూ. 16.5 కోట్లు అదనంగా చెల్లించినట్లు ఆరోపించారు. రెండు లావాదేవీలకు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, అయోధ్య మేయర్ రిషికేశ్ ఉపాధ్యాయ సాక్షులుగా వ్యవహరించారని పేర్కొన్నారు.
"రవి మోహన్ తివారీ, సుల్తాన్ అన్సారీ రూ. 2 కోట్ల విలువైన భూమిని సాయంత్రం 7.10 గంటలకు కొనుగోలు చేశారు. అదే భూమిని సాయంత్రం 7.15 గంటలకు రామ జన్మభూమి ట్రస్టుకు చెందిన చంపత్ రాయ్ రూ.18.5 కోట్లకు కొన్నారు."
-సంజయ్ సింగ్ ట్వీట్
ఎస్పీ నేత పవన్ పాండే సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో భూమి విలువ 10 రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.
ట్రస్ట్ ఏమంటోంది?
ఆప్, ఎస్పీ ఆరోపణలపై వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు, రామ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ స్పందించారు. బహిరంగ మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాలతోనే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వీటిని తాము పట్టించుకోబోమన్నారు. గత వందేళ్లుగా ఇలాంటి ఆరోపణలను చేస్తూనే వస్తున్నారని చెప్పారు. ఈ మేరకు జూన్ 13న ప్రకటన విడుదల చేశారు.
"సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అయోధ్యకు వచ్చి భూములను కొనుగోలు చేశారు. భూముల ధరలు పెరిగాయి. వార్తల్లో కథనాలు వచ్చిన ప్లాట్.. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇప్పటివరకు కొనుగోలు చేసిన భూముల ధరలు ఓపెన్ మార్కెట్ రేట్లకన్నా తక్కువే."
-చంపత్ రాయ్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి
పరస్పర ఒప్పందంతోనే భూముల కొనుగోలు అమ్మకాలు జరుగుతాయని చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఈ భూమి కొనుగోలు సైతం అదే విధంగా జరిగిందని చెప్పారు. 'ఒప్పందం కుదిరిన తర్వాత అంగీకార పత్రంపై సంతకం చేస్తారు. స్టాంప్ పేపర్లు, కోర్టు ఫీజుల కోసం ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. అంగీకార పత్రం ఆధారంగానే భూమి కొనుగోలు జరిగింది. దీనికి అనుగుణంగానే అమ్మే వ్యక్తికి భూమి ధర మొత్తాన్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాం' అని చంపత్ రాయ్ వివరించారు.
అయోధ్య మేయర్ రిషికేష్ ఉపాధ్యాయ్ సైతం ఇదే తరహా వివరణ ఇచ్చారు. రెండు లావాదేవీల్లో ఉపాధ్యాయ్ సాక్షిగా ఉన్నారు. తొలి లావాదేవీకి సంబంధించి.. భూమి కొనుగోలు విషయంపై రెండేళ్ల క్రితమే ప్రాపర్టీ డీలర్‌తో ఒప్పందం కుదిరిందని, అది పాత రేట్ల ప్రకారం జరిగిందని చెప్పారు. ట్రస్టుకు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం విక్రయించినట్లు తెలిపారు. ఇందులో అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.
మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో సుల్తాన్ అన్సారీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెరపైకి వచ్చాయి. దీంతో అన్సారీకి ఆ పార్టీతో సంబంధం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. భూమిని వేరే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి.. ట్రస్ట్‌కు విక్రయించినవారిలో అన్సారీ ఒకరు.
విపక్షాలు తగ్గట్లే..
అయితే, విపక్షాలు మాత్రం ట్రస్ట్ ఇచ్చిన వివరణతో శాంతించడం లేదు. భూముల కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని పలువురు నేతలు కోరుతున్నారు.
సుప్రీం పరిష్కారం!
భక్తుల విరాళాలను దుర్వినియోగం చేయడం.. ప్రజల విశ్వాసానికే అవమానకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. రాముడి పేరు మీదుగానే కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ట్రస్టు ఏర్పడింది కాబట్టి.. ఈ సమస్యను అత్యున్నత ధర్మాసనమే పరిష్కరించాలని కాంగ్రెస్ కోరింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని పేర్కొంది.
మరోవైపు, ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు లఖ్‌నవూలో ఆందోళనకు దిగారు.
సంజయ్ రౌత్ షాక్!
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చూపించిన ఆధారాలు తనను షాక్‌కు గురిచేశాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. రామ మందిరం తమకు విశ్వాసానికి సంబంధించిన అంశమని, కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఆరోపణలపై ట్రస్ట్ పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం స్పందించాలని అన్నారు.
సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భర్ ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. భాజపా, ఆర్ఎస్ఎస్ ప్రజల విశ్వాసాలతో వ్యాపారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
డిప్యూటీ సీఎం ధ్వజం
ఈ ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ స్పందిస్తూ.. విపక్షాల తీరును తప్పుబట్టారు. రామ జన్మభూమికి అపకీర్తి తెచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ విపక్ష నేతలు విడిచిపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమాధానం ఇస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: అయోధ్య రామాలయం నమూనా విడుదల