భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో మరోసారి హింసాత్మక ఘర్షణ(India China soldiers clash) చెరలేగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఓ వార్తా కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రక్షణ, విదేశాంగ విధానాలను కేంద్రం రాజకీయ సాధానాలుగా ఉపయోగించుకుంటోందని అన్నారు. ఇదివరకెన్నడూ భారత్ ఇలాంటి దుర్భర స్థితిలో లేదని వ్యాఖ్యానించారు.
"రక్షణ, విదేశాంగ విధానాలను భారత ప్రభుత్వం రాజకీయ సాధనాలుగా ఉపయోగించుకోవడం దేశాన్ని బలహీనంగా మార్చింది. గతంలో ఎప్పుడూ భారత్ ఇలాంటి దుర్భర స్థితిలో లేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కథనంలో ఏముందంటే?
గతేడాది జూన్ 15న హింసాత్మక ఘటన(galwan valley clash) జరిగిన ప్రదేశంలోనే మరోసారి ఘర్షణలు తలెత్తాయంటూ వార్తా కథనం పేర్కొంది. అంతేగాక, లద్దాఖ్ సరిహద్దులో చైనా భారీగా సైన్యాన్ని మోహరిస్తోందని తెలిపింది. మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటోందని వివరించింది. 400కిమీ దూరంలోని విమానాలను ధ్వంసం చేయగలిగే క్షిపణి వ్యవస్థలను మోహరించిందని వెల్లడించింది.
సైన్యం ఏమంటోంది?
అయితే, ఈ వార్త కథనాన్ని భారత సైన్యం పూర్తిగా ఖండించింది. ఫిబ్రవరిలో కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందానికి కట్టుబడి.. ఇరుదేశాలు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది.
"వార్తా కథనంలో పేర్కొన్నట్టు.. గల్వాన్‌లో కానీ, మరే ఇతర ప్రాంతంలో కానీ ఘర్షణలు జరగలేదు. సరైన ఆధారాలు లేకుండా దురుద్దేశంతో ఈ వార్తను రాశారు. చైనాతో కుదిరిన ఒప్పందాలు ఉల్లంఘనకు గురయ్యాయని కథనం పేర్కొంది. అది పూర్తిగా తప్పు. సమస్యను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణ ప్రదేశాల్లో పెట్రోలింగ్ కొనసాగుతోంది."
-ఆర్మీ ప్రకటన
క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. పీఎల్ఏ కదలికలు, సైన్యం సంఖ్యను నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో భారత్- చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలలో బలగాల ఉపసంహరణ పూర్తయింది. మిగిలిన ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిశోర్!