బెంగాల్‌లో భాజపా అభ్యర్థుల జాబితా తీరిది! ఒకరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు సిట్టింగ్ ఎంపీలను కమలనాథులు అసెంబ్లీ బరిలోకి దించటం ఆశ్చర్యపరిచే నిర్ణయమే అయినా.. దీని వెనక గట్టి వ్యూహమే ఉంది!
బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా అధికారానికి చేరువకావాలని తపిస్తున్న భారతీయ జనతాపార్టీ- ఆ దిశగా తమ ప్రయత్నాన్ని గాలివాటంగానో, లేక అధికార దాహంగానో చూడకుండా ఓటర్లలో ఆలోచన రేకెత్తించే యత్నం చేస్తోంది. సోనార్ బంగ్లా (బంగారు బెంగాల్) కోసం తమకున్న సంకల్ప బలాన్ని బెంగాలీల్లో చొప్పించటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కేవలం తృణమూల్‌ను దించేయటమే లక్ష్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక బెంగాల్‌ను అభివృద్ధి చేయటానికి అవసరమైన మందీమార్బలం, వ్యూహాలు ఉన్నాయనే సంకేతాలిస్తోంది.
నిర్మాణాత్మక నిర్ణయాలు
బాబుల్ సుప్రియో.. టోలిగంజ్ నుంచి, లాకెట్ ఛటర్జీ.. చుంచురా, నిశిత్ ప్రమాణిక్.. దిన్హట నుంచి బరిలోకి దిగబోతున్నారు. వీరికి తోడుగా... రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ, జర్నలిస్టు, బుద్ధిజీవిగా పేరొందిన స్వపన్‌దాస్ గుప్తా .. తారకేశ్వర్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఐదేళ్ల పదవీకాలంలో రెండేళ్లయినా ముగియక ముందే.. సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించటం సాధారణంగా ఎవ్వరూ చేయరు. పైగా ఈ నలుగురిలో ఒకరైన బాబుల్ సుప్రియో కేంద్ర మంత్రి కూడా!
దీనివల్ల రెండు సంకేతాలు- ఒకటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గాక సమర్థ పాలనకు అవసరమైన వ్యక్తులను సమకూర్చుకుంటున్నామని తెలపటం. రెండు- తర్వాత వచ్చే లోక్‌సభ ఉప ఎన్నికలను కూడా గెల్చుకుంటామనే ధీమాను ముందే వ్యక్తంజేయటం.
తాము కేవలం మమతను ఓడించటం కోసమో, మరో రాష్ట్రంలో అధికారాన్ని తమ ఖాతాలో వేసుకోవటం కోసమో మాత్రమే కాకుండా నిజంగానే తాము హామీ ఇస్తున్న ‘సొనార్ బంగ్లా’ కోసం అవసరమైన సత్తా తమకుందనే భావనను బెంగాలీ ప్రజల్లో బలంగా నాటడం కూడా అవసరమని భాజపా అధినాయకత్వం భావిస్తోంది.
ఆర్థిక వేత్తనూ..
మిగిలిన రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నా.. బెంగాల్‌లో మాత్రం కాసింత భిన్నం! ఇందుకు కారణం- సంప్రదాయబద్ధంగా కుల, మతపరమైన ప్రభావాలు బెంగాల్ రాజకీయాల్లో తక్కువ. సాహిత్యం, కళలతో కూడిన బుద్ధిజీవి సమాజంగా పేరొందిన బెంగాల్‌లో ఆలోచనాపరులు ఇలాంటివాటికి తావివ్వరని, ఆవేశాలకు లోనుకాకుండా వివేచనతో వ్యవహరిస్తారనే పేరుంది. కాబట్టి.. అలాంటి సంప్రదాయ బుద్ధిజీవులను ఆకట్టుకోవటానికి భాజపా తన వ్యూహాలను పదును పెడుతోంది. అందులో భాగంగానే స్వపన్‌దాస్‌గుప్తాలాంటి వారిని రంగంలోకి దించింది. అంతేగాకుండా.. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేసిన అశోక్ లాహిరిని ఉత్తర బెంగాల్‌లోని అలిపుర్‌దౌర్ నుంచి బరిలోకి దించారు కమలనాథులు! పార్టీ అధికారంలోకి వస్తే అశోక్ లాహిరే ఆర్థిక మంత్రి అవుతారని ఇప్పటికే ప్రచారం మొదలైంది కూడా! ‘‘బుద్ధిజీవుల రాష్ట్రంగా పేరొందిన బెంగాల్‌లో ఇన్నాళ్లూ భాజపాకు పెద్దగా ఆదరణ లేదు. బుద్ధిజీవుల సమాజం ఆ పార్టీ సిద్ధాంతాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడిప్పుడే వారిలో మార్పు కన్పిస్తోంది. స్వపన్‌దా, అశోక్‌లాంటివారి ద్వారా ఆ సమాజానికి కూడా చేరువవుతున్నాం’’ అని భాజపా సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించటం గమనార్హం.
ఆ సీటులోనూ గట్టి పోటీ..
టోలిగంజ్‌లో బాబుల్ సుప్రియోను దించటం వెనక కూడా ఎత్తుగడ లేకపోలేదు. ఆ స్థానం నుంచి కూడా మమత బెనర్జీ బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఇప్పటికే నందిగ్రామ్ నుంచి నామినేషన్ వేసిన మమత అక్కడ విజయంపై ధైర్యంగా లేరు. తాను టోలిగంజ్ నుంచి కూడా పోటీ చేయొచ్చని ఆమే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో టోలిగంజ్‌లో సుప్రియో ఆమెకు గట్టి పోటీ ఇస్తారు. అప్పుడు మమతను ఇక్కడా నిలువరించినట్లవుతుందనేది భాజపా వ్యూహంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి : జన చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష