Amit shah Tour Cancel in Telangana : తెలంగాణలో రేపటి కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటన రద్దైంది. గుజరాత్లో తీరం వైపు దూసుకొస్తున్న బిపోర్ జాయ్ తుపాను కారణంగా ఈ పర్యటన రద్దు అయిందని కమలం నేతలు తెలిపారు. ఈ పర్యటనలో అమిత్ షా ముఖ్యమైన నేతలతో సమావేశాలతో పాటు ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే తుపాన్ ప్రభావంతో అమిత్ షా గుజరాత్ వెళ్లాల్సి ఉన్నందున తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా రెపరెపలాడాలని దిల్లీలో కమలం నేతలు వ్యూహరచన సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ప్రణాళికబద్ధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షా రేపు రావాల్సి ఉంది. కర్ణాటకలో ఓటమి అనంతరం బీజేపీ తమ పార్టీ శ్రేణులు నిరాశకు లోనుకాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు అమలుచేస్తోంది.
ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనాల్లోకి వెళ్లగా... తాజాగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా తెలంగాణలో రేపు పర్యటించాల్సి ఉండగా బిపోర్ జాయ్ తుపాను కారణంగా షా పర్యటన రద్దైంది. బిపోర్ జాయ్ తుపాను నేపథ్యంలో అమిత్‌షా రాష్ట్ర పర్యటన రద్దైనట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. కేంద్రహోంమంత్రి అమిత్‌షా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ బిపోర్ జాయ్ తుపాను కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. అమిత్ షా పర్యటన రద్దు కావడంతో ఖమ్మంలో నిర్వహించాల్సిన బీజేపీ బహిరంగ సభ వాయిదా పడింది.
త్వరలోనే అమిత్ షా పర్యటన ఖరారు : అమిత్ షా పర్యటన రద్దు కావడంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ ఛుగ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బిపోర్ జాయ్ తుఫాన్ కారణంగా రేపు ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు తరుణ్ ఛుగ్ తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అమిత్ షా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే ఖమ్మం సభకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తామన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులను ప్రకటించామని ఇక అధ్యక్షుడి మార్పు ఎక్కడిదన్నారు. పార్టీలో విభేదాలు ఏమీ లేవని అందరం కలిసికట్టుగా పని చేసుకుంటున్నట్లు తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు.
త్వరలో సభను నిర్వహించి... బీజేపీ సత్తా చూపిస్తాం : రేపు ఖమ్మంలో నిర్వహించే సభ వాయిదా వేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తుఫాన్ తీవ్రత గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువగా ఉందని... తుఫాన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేయాల్సి ఉందన్నారు. ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అందుకే సభను వాయిదా వేసినట్లు తెలిపారు. రేపటి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినప్పటికీ రాజకీయాల కంటే ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమన్నారు. త్వరలో ఖమ్మంలో సభను నిర్వహించి... బీజేపీ సత్తా చూపిస్తామన్నారు.
ఇవీ చదవండి :