Amar jawan jyoti: దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50ఏళ్లుగా ఏకధాటికి వెలిగిన అమర జవాను జ్యోతి శుక్రవారం ఆరిపోనుంది. దీన్ని జాతీయ యుద్ధ సార్మకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు గుర్తుగా అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు.
Amar jawan jyoti merging:
నిర్వహణ కష్టతరం కావడం వల్ల రెండింటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్ చీఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో జరిగే కార్యక్రమంలో అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో కలపనున్నారు.
National War Memorial Amar jawan jyoti:
అమర జవాన్ల కోసం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించినందున ఇండియా గేట్ వద్ద ప్రత్యేక జ్యోతి ఎందుకన్న వాదన ఉన్నట్లు సైనికవర్గాలు పేర్కొన్నాయి. 1947-48 పాకిస్థాన్ యుద్ధం మొదలుకొని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల వరకు అందరి పేర్లు జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్నాయని గుర్తుచేస్తున్నాయి.
రాహుల్ మండిపాటు..
అయితే, ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భాజపాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు ఆరోపోవడం విచారకరమని అన్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమర జవాను జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని భరోసా ఇచ్చారు.
కేంద్రం వివరణ..
అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. జ్యోతిని ఆర్పేయడం లేదని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నామని తెలిపాయి. "ఇండియా గేట్ మీద ముద్రించిన జవాన్ల పేర్లలో 1971 యుద్ధంలో మరణించిన వారి పేర్లు లేవు. మొదటి ప్రపంచ యుద్ధం, అఫ్గాన్-ఆంగ్లో యుద్ధంలో పోరాడిన అమరుల పేర్లే ఉన్నాయి. ఇది వలస పాలనను గుర్తు తెస్తుంది. జాతీయ యుద్ధ స్మారకంలో అందరి పేర్లు ఉంటాయి. అమర జవాన్లకు ఇదే నిజమైన శ్రద్ధాంజలి. ఏడు దశాబ్దాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించలేని వాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు" అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు