కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు అన్ని విధాలుగా కేంద్రం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. వైరస్ను ఎదుర్కొనేందుకు వైద్య పరికరాలు, మందుల ఉత్పత్తిని, పంపిణీని రెండు రెట్లు పెంచినట్లు చెప్పారు. వాక్సినేషన్ ప్రక్రియను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్ద రాష్ట్రాలకు ప్రతి నాలుగు రోజులకు, చిన్న రాష్ట్రాలకు ప్రతి ఏడు రోజులకు వాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొవాగ్జిన్ ఉత్పత్తి సెప్టెంబర్ 2021 నాటికి 10 రెట్లు పెరుగుతుందని చెప్పారు.
12 కోట్ల టీకా డోసుల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 12 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేవలం 92 రోజుల్లోనే ఈ టీకాలను అందించినట్లు పేర్కొంది. ప్రపంచంలో భారత్లోనే వేగవంతమైన వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది. 12 కోట్ల టీకా డోసుల పంపిణీకి అమెరికా 97 రోజులు తీసుకోగా.. చైనాకు 108 రోజులు పట్టిందని తెలిపింది.
ఇప్పటివరకు 12,26,22,590 టీకా డోసులను పంపిణీ చేయగా.. 20,22,599 మంది మొదటి డోసు తీసుకున్నారు. 6,62,357 మంది టీకా రెండో డోసు తీసుకున్నారు.
162 ఆక్సిజన్ ప్లాంట్లు..
ఆక్సిజన్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 162 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 154.13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది.
ఈ 162 ఆక్సిజన్ ప్లాంట్లలో దేశంలో వివిధ రాష్ట్రాలలో 33 ప్లాంట్లను ఇప్పటికే నిర్మించారు. ఈ 162 కాకుండా రాష్ట్రాలు మరో 100 ప్లాంట్లను కోరుతున్నాయి. వాటిని కూడా మంజూరు చేస్తామని కేంద్రం తెలిపింది.
ఏప్రిల్ చివరి నాటికి 59 ప్లాంట్లు, మే నాటికి మరో 80 ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం కేంద్రం 201.58 కోట్లను కేటాయించనుంది.
రెండింతల పాజిటివిటీ రేటు...
దేశంలో గత 12 రోజుల్లోనే పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగిందని కేంద్రం తెలిపింది. 8 శాతం ఉన్న పాజిటివిటీ రేటు అమాంతంగా 16.69 శాతానికి ఎగబాకిందని పేర్కొంది. గత నెలలోనే 3.05 శాతం ఉన్న వారాంతపు పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 13.54 శాతానికి చేరిందని తెలిపింది.
ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 30.38 పాజిటివిటీ రేటు నమోదైందని కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత గోవా 24.24 శాతం, మహారాష్ట్ర 24.17 శాతంతో తర్వాత వరుసలో ఉన్నాయి.
దేశంలో కొత్తగా 2లక్షల 61 వేల 500 కేసులు నమోదవగా.. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్లలోనే కేవలం 78.56 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,501 మరణాలు సంభవించగా.. ఈ 10 రాష్ట్రాల్లోనే 82.94 శాతం మరణాలు ఉన్నాయని కేంద్రం తెలిపంది.
ఇదీ చదవండి: 'దిల్లీలో 30 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు'
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మృతి