కేంద్రంలో అధికార మార్పిడి జరగాలని తాము కోరుకోవడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. కేవలం వివాదాస్పద సాగు చట్టాల రద్దు కోసమే ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. సింఘు సరిహద్దులో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేంద్రం.. రైతులను చర్చలకు పిలవాలని వ్యాఖ్యానించారు. తమ కమిటీ చర్చలకు సిద్ధంగానే ఉందని.. కేవలం దీనితోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
"కేంద్రంలో అధికారం మారాలన్నది మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం తన పని తాను చేసుకోవాలి. కానీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. అంతేకాకుండా మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. అందుకోసమే మేం పోరాడుతున్నాం."
-రాకేశ్ టికాయిత్, భారతీయ కిసాన్ యూనియన్ నేత
రైతులతో కేంద్రం చర్చలు జరిపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంయుక్త్ కిసాన్ మోర్చాతో పాటు రైతు సంఘాలన్నీ సాగు చట్టాల్ని రద్దు చేయాలనే ఆందోళన చేస్తున్నాయని, కేంద్రం భ్రమల్లో ఉండొద్దని హెచ్చరించారు. 40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాల వల్ల ఏం నష్టం జరిగింది?'