Actress Jaya Prada Jail : కార్మికుల నుంచి ఈఎస్ఐ డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించని కేసులో ప్రముఖ నటి జయప్రదకు ఎగ్మోర్ కోర్టు విధించిన 6నెలల జైలు శిక్షను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. కార్మికులకు డబ్బులు వాపస్ ఇవ్వడంపై జయప్రద కోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో 15 రోజుల్లోగా జయప్రద ఎగ్మోర్ కోర్టులో లొంగిపోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ ఆదేశించారు. అలాగే కార్మికుల పేరిట రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఎగ్మోర్ కోర్టు విధించిన 6నెలల జైలు శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
కేసు ఏంటంటే?
చెన్నైలోని అన్నా రోడ్లో జయప్రద ఓ థియేటర్‌ను నడిపించారు. రామ్‌కుమార్, రాజ్‌బాబు అనే ఇద్దరితో కలిసి ఈ థియేటర్‌ను నిర్వహించేవారు. అయితే, థియేటర్లో పనిచేసే వర్కర్ల నుంచి ఈఎస్ఐ డబ్బులు వసూలు చేశారు. 1991 నుంచి 2002 మధ్య రూ.8.17 లక్షలు, 2002 నుంచి 2005 మధ్య రూ.లక్షా 58వేలు, 2003లో మరో రూ.లక్షా 58 వేలను నిందితులు సేకరించారు. కానీ, ఈ డబ్బును వారు కార్మికుల ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయలేదు. దీంతో కార్మికులంతా బీమా సంస్థను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి చెన్నై ఎగ్మోర్ కోర్టులో ఐదు కేసులు దాఖలయ్యాయి. ఈఎస్ఐ కంపెనీ తరఫున ఈ కేసులు నమోదయ్యాయి.
ఎగ్మోర్ కోర్టులో విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపించిన జయప్రద.. వర్కర్లకు ఇన్సూరెన్స్ డబ్బులు తిరిగి ఇస్తామని అన్నారు. అయితే, డబ్బులు ఈఎస్ఐ ఖాతాలో జమ చేయకపోవడం వల్ల వర్కర్లు తీవ్రంగా ప్రభావితమయ్యారని ఈఎస్ఐ వాదించింది. డబ్బు తిరిగి చెల్లిస్తామనే జయప్రద ప్రతిపాదనను ఈఎస్ఐ తరఫు న్యాయవాది ఖండించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 10న తీర్పు చెప్పింది. జయప్రదతో పాటు మరో ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దోషులకు ఎలాంటి బెయిల్ ఇవ్వకుండా రూ.5వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు జయప్రద. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
Jayaprada Jail : నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష.. వారి ఫిర్యాదు వల్ల..