Jacqueline Fernandez horse: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆదివారం ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయినందునే ఇలా చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ నుంచి రూ.10కోట్లు విలువైన ఖరీదైన కానుకలను ఫెర్నాండెజ్ అందుకోవటమే ఆమె ఈ కేసులో చిక్కుకునేందుకు ప్రధాన కారణమైందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఖరీదైన గుర్రం, పిల్లులు
సుకేశ్ జైలులో ఉన్నప్పటికీ 2021 జనవరి నుంచి ఫోన్ ద్వారా జాక్వెలిన్‌తో మాట్లాడుతున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది ఈడీ. అతని నుంచి ఖరీదైన కానుకలు పొందినట్లు తెలిపింది. రూ.10కోట్లు విలువైన కానుకలు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్‌ను పలు మార్లు ప్రశ్నించగా.. ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల ఆమెపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది ఈడీ. అందుకే ముంబయి విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు అధికారులు చెప్పారు.
చంద్రశేఖర్ పంపిన కానుకల్లో రూ.52 లక్షల విలువైన గుర్రం, నాలుగు పర్షియన్ పిల్లులు(ఒక్కోటి రూ.9 లక్షలు), ఖరీదైన చాక్లెట్లు, పూలు ఉన్నట్లు సమాచారం. నటి కుటుంబ సభ్యులకు సైతం నగదు పంపించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే, ఛార్జిషీట్లో చేర్చిన మరో నటి నోరా ఫతేహికి సుకేశ్ రూ.1 కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్ పంపించినట్లు ఈడీ పేర్కొంది.
ఫొటో వైరల్..
మనీలాండరింగ్ కేసుకు, ఫెర్నాండెజ్‌కు ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటన చేసింది దిల్బార్ టీం. ఈ కేసులో నోరా ఫతేహి బాధితురాలని, ఒక సాక్షిగా ఫెర్నాండెజ్ అధికారులకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. నిందితుడితో ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని పేర్కొంది.
మరోవైపు.. గతంలో ఓ వాష్‌రూమ్‌లో సుకేశ్ చెంపపై జాక్వెలిన్ ముద్దు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోమారు నోటీసులు..
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మారోమారు నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. డిసెంబర్ 8న దిల్లీలో దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది.
కేసు ఏమిటి?
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్ సన్నిహితుడు లీనా మరియా పాల్ సహా.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్ జైలు నుంచే కాలర్ ఐడీ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సుకేశ్ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతన్ని జాక్వెలిన్ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్‌కు సంబంధించిన 20కిపైగా కాల్ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్ చంద్రశేఖర్, లీనా పాల్‌పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: బిజినెస్మెన్ భార్యలకు వల.. రూ.200 కోట్లకు టోకరా!