Bhasha Samman Award to Bethavolu Ramabrahmam: ఉత్తమ కవి, పండితుడు, విమర్శకుడు, గురువు.. ఈ విధంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం వరించింది. ప్రాచీన, మధ్యయుగపు సాహిత్యంపై వెలువరించిన రచనలకు.. 2021 సంవత్సరానికి ఈ అవార్డు ఆయనకు దక్కింది. సాహితీ సేవకు గుర్తింపుగా దక్షిణ భారతదేశం నుంచి ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటించింది.
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం కవిగా, రచయితగా, అనువాదకుడిగా, పండితుడిగా, వ్యాఖ్యాతగా, అష్టావధానిగా సుప్రసిద్ధులు. ఆయన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించారు. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచించారు. సాహితీ వ్యాసాలను సైతం వెలువరించారు. ఆధునికతరం పద్య సాహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆస్వాదించేలా చేయడానికి ‘పద్య కవితా పరిచయం’ పుస్తకాన్ని తీసుకువచ్చారు.
Kethu Viswanatha Reddy: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత
గతంలో వరించిన ఆవార్డులు: అనువాదంలో చేయి తిరిగిన రామబ్రహ్మం గతంలో ‘దేవీ భాగవతం’ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. దీంతోపాటు పలు ఇతర పురస్కారాలు అందుకున్నారు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ పూర్తి చేసిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు చేశారు. తెలుగు వ్యాకరణంపై సంస్కృతం, ప్రాకృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు. సంస్కృతాంధ్ర భాషల్లో దిట్ట. గుంటూరులో ఉపన్యాసకుడిగా, బొమ్మూరు సాహిత్య పీఠం ఆచార్యుడిగా పని చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా సేవలు అందించారు. తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తూ భాషా వ్యాప్తికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అందించిన సేవలు అపురూపం. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు.
పురిటిగడ్డ నల్లజర్ల: చదువుకునే వయసులోనే అవలీలగా అవధానం చేశారు. పద్య విద్యకు ఆయన పెట్టింది పేరు. ఎన్నో పద్య కావ్యాలు, శతకాలు, నాటకాలు, నృత్య రూపకాలు, కథలు రాసిన సాహితీస్రష్ట. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో బేతవోలు సత్యనారాయణమూర్తి, రాధ రుక్మిణీదేవి దంపతులకు రామబ్రహ్మం 1948, జూన్ 10లో జన్మించారు. తండ్రి గుమాస్తాగా పనిచేసేవారు. రామబ్రహ్మం నాగార్జున యూనివర్సిటీలో ఆచార్యుడిగా పని చేసే సమయంలో ఆ వర్సిటీని సందర్శించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. రామబ్రహ్మం పద్యాలను అభినందిస్తూ ‘కొత్తగా ఏర్పాటు చేయబోయే తెలుగు విశ్వవిద్యాలయానికి మీలాంటి వారు అవసరం’ అని అభినందించారు.
![రామబ్రహ్మంను అభినందిస్తున్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2023/18863390_2.png)
ప్రత్యేక కళలకు సంబంధించిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంతోపాటు.. ఎన్టీఆర్ రాజమహేంద్రవరం (బొమ్మూరు) కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, అక్కడ రామబ్రహ్మాన్ని నియమించారు. ఆయన 1994 నుంచి మూడేళ్లయపాటు అక్కడ సేవలందించారు. పలువురు విద్యార్థులను సాహిత్య పరిశోధన దిశగా ప్రోత్సహించారు. తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పన, పరిశోధన విషయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా తెలుగు వ్యాకరణాలపై సంస్కృత, ప్రాకృత వ్యాకరణాల ప్రభావం, శృంగార శ్రీకంఠము (పద్య కవిత్వం), స్వర్ణకమల (రూపకం), షోడశీ (సంస్కృతంలో వ్యాసాలు), వేణీ సంహారమ్ (వ్యాఖ్య) వంటి పలు ఉద్గ్రంథాలను రచించారు.
కొవ్వూరు విద్యాపీఠంతో అనుబంధం: బేతవోలు రామబ్రహ్మం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం పూర్వ విద్యార్థి. ఎస్‌ఎస్‌ఎల్‌సీ అనంతరం విద్యాపీఠంలో చేరి భాషా ప్రవీణ పూర్తి చేశారు. రెండేళ్ల చదువు సాధారణంగా సాగినా.. తెలుగు పండితులు రావూరి వెంకటేశ్వర్లు శిష్యరికంలో చదువుతో పాటు అవధానాల్లోనూ రాణించి తోటి వారికి స్ఫూర్తిగా నిలిచారు. 1965 నుంచి 1969 వరకు విద్యాపీఠంలో ఉండి చదువుకున్నారు. ప్రవీణ కోర్సులో ప్రతిభ కనబర్చి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాన్ని పొందారు.
300 వరకు అవధానాలు: పద్దెనిమిదేళ్ల వయసులో మొదలుపెట్టి పాతికేళ్లలో 300 వరకు అవధానాలు చేశారు. బొమ్మూరు విశ్వవిద్యాలయం తరఫున కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించారు. నండూరి రామకృష్ణమచార్యులుతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. ‘కొత్త గోదావరి’ వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలు, కథలు రాశారు. ఎన్నో అనువాద రచనలు చేశారు. సాహిత్య వ్యాసాలు, పరిశోధన గ్రంథాలు రాశారు. అన్నింటికన్నా ‘మృచ్ఛకటికం’ వంటి సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తిని గడించారు.
నేటితరం చదవటం, రాయటం విస్మరించవద్దు: నేటితరానికి అక్షరాలతో సంబంధం లేకుండాపోతోందని బేతవోలు రామబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చదవడం, రాయడం తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు ఇవన్నీ నేర్పాలన్నారు. సంస్కృత నాటకాలకు తెలుగు వ్యాఖ్యానం.. తెలుగు పద్యకావ్యాలకు పాఠక మిత్ర వ్యాఖ్యానమని అన్నారు. ఇదే జీవిత లక్ష్యంగా నడిచినట్లు పేర్కొన్నారు. పద్యకావ్యాలను పాఠకులకు దగ్గర చేయాలనేది ఆయన సంకల్పమని తెలిపారు. దానికి తగిన గుర్తింపుగా ఈ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి ఇచ్చే ఈ పురస్కారం ఈసారి తెలుగు భాషకు రావడం.. అందులో తనకు రావడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ తరానికి ఆయన సూచన ఒకటేనని. చదవడాన్ని, రాయడాన్ని విస్మరించవద్దని అన్నారు. ప్రస్తుతం హోంవర్క్ కూడా ట్యాబ్‌లోనే చేస్తున్నారని.. యువతరం వారి భాషలోని సాహిత్యాన్ని చదవాలని సూచించారు. సాహిత్యం, సంగీతం వంటి లలితకళలు నేర్చుకోవాలని ఆయన వివరించారు.
బేతవోలుకి చంద్రబాబు శుభాకాంక్షలు: భాషా సమ్మాన్ పురస్కారం దక్కినందుకు రామబ్రహ్మంకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. బేతవోలుకు భాషా సమ్మాన్ పురస్కారం వరించటం గర్వకారణంగా ఉందని అన్నారు. సాహితీలోకానికి రామబ్రహ్మం సేవలకు గుర్తింపే ఈ పురస్కారమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం గారికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి భాషా సన్మాన్ పురస్కారం దక్కడం ఎంతో గర్వకారణం. కవిగా, అష్టావధానిగా పేరొందిన రామబ్రహ్మం గారు సాహితీ లోకానికి చేసిన సేవలకు లభించిన గుర్తింపే ఈ పురస్కారం. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు… pic.twitter.com/wkCEhkyyOH
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం గారికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి భాషా సన్మాన్ పురస్కారం దక్కడం ఎంతో గర్వకారణం. కవిగా, అష్టావధానిగా పేరొందిన రామబ్రహ్మం గారు సాహితీ లోకానికి చేసిన సేవలకు లభించిన గుర్తింపే ఈ పురస్కారం. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు… pic.twitter.com/wkCEhkyyOH
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2023ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం గారికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి భాషా సన్మాన్ పురస్కారం దక్కడం ఎంతో గర్వకారణం. కవిగా, అష్టావధానిగా పేరొందిన రామబ్రహ్మం గారు సాహితీ లోకానికి చేసిన సేవలకు లభించిన గుర్తింపే ఈ పురస్కారం. ఈ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు… pic.twitter.com/wkCEhkyyOH
— N Chandrababu Naidu (@ncbn) June 28, 2023