బిహార్ బాంకాలో విషాదకర ఘటన జరిగింది. 26 ఏళ్లుగా నిర్దోషినంటూ పోరాటం చేస్తున్న వ్యక్తి.. తనకు అనుకూలంగా తీర్పు రాగానే ఆనందం తట్టుకోలేక మరణించాడు. న్యాయమూర్తి తీర్పును వెలువరించగానే.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు.
ఇదీ జరిగింది
బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుంకా గ్రామానికి చెందిన నాగో సింగ్ సహా మరో ఐదుగురిపై 1996లో పంట తగలపెట్టారని కేసు నమోదైంది. వీరందరూ కొంతకాలం విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. తాము నిర్దోషులమంటూ గత 26 ఏళ్లుగా పోరాడుతున్నారు.
తాజాగా బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును విన్న నాగో సింగ్(76).. ఆనందాన్ని తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధరించారు. మృతుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: చిక్కుల్లో జెనీలియా దంపతులు- గురి చూసి కొట్టిన భాజపా!
భుజంపై చిన్నారి మృతదేహం.. అంబులెన్సు లేక బస్సులో ఇంటికి ప్రయాణం