Aadhaar Voter ID Link Bill: ఓటును ఆధార్‌తో అనుసంధానించి.. ఒక వ్యక్తి వేర్వేరు చోట్ల ఓటు కలిగి ఉండడాన్ని నివారించే దిశగా మరో లాంఛనం పూర్తయ్యింది. ఇందుకు ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభలో ప్రవేశ పెట్టగా, రాజ్యసభ మూజువాజీ ఓటుతో ఆమోదించింది.
బిల్లును ప్రవేశపెట్టే సమయంలో దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఎన్సీపీ డివిజన్‌కు పట్టుబట్టాయి. సెలక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాన్ని అందించాయి. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించగా, నిరసనగా ఆయా పార్టీలు వాకౌట్ చేశాయి. అనంతరం బిల్లును సభ ఆమోదించింది. బిల్లుకు వైకాపా, జేడీ-యూ, అన్నాడీఎంకే, బీజేడీ మద్దతు తెలిపాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లును సోమవారమే లోక్‌సభ ఆమోదించింది.
What is Electoral Reforms Bill
ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడం, బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్రవేసింది.
పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్ ఐడీ లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం.
కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు.
ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు.
ఇదీ చదవండి: పార్లమెంటులో కరోనా కలకలం.. ఆ ఎంపీకి పాజిటివ్