బెంగళూరు నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఇటీవల అవాంఛనీయ ఘటన జరిగింది. ఏప్రిల్ 6న ఐ5-722 విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు బట్టలు విప్పేసి నానా బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తిస్తూ హల్‌చల్ చేశాడు. తొలుత అతడు లైఫ్ జాకెట్ల గురించి వాదనకు దిగాడు. అనంతరం సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అకస్మాత్తుగా బట్టల్ని పూర్తిగా విప్పేయగా తోటి ప్రయాణికులంతా విస్తుపోయారు.
తాగిన మత్తులో..
ఈ ఘటనపై ఎయిర్ ఏషియా ఇండియా ఎయిర్‌లైన్స్ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ, తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడు తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తోటి ప్రయాణికులతో కలిసి సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేయడంతో చివరకు కూర్చున్నాడని చెప్పారు. ఆ తర్వాత దీని గురించి పైలట్లకు సమాచారం ఇచ్చారని వివరించారు. దీంతో పైలట్ జరిగిన సంఘటనపై దిల్లీలోని ఏటీసీకి సమాచారం అందించి, త్వరగా ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారు.
దిల్లీలో విమానం ల్యాండింగ్ కాగానే, అతడిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై దిల్లీ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. దిల్లీ పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:బైక్ కొంటే హెల్మెట్ ఉచితం