నాలుగేళ్ల చిన్నారి అరుదైన సాహసయాత్ర చేపట్టింది. బుడిబుడి అడుగులువేస్తూ నర్మదా నది చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తోంది. ఏటా లక్షల మంది భక్తులు వివిధ మార్గాల్లో 'నర్మదా పరిక్రమ' అనే పేరుతో నది చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని స్థానికులు విశ్వసిస్తుంటారు. అయితే ఈసారి నాలుగేళ్ల చిన్నారి రాజేశ్వరి.. నర్మదా నది ప్రదక్షిణలో పాల్గొనడం.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
చిన్నారి రాజేశ్వరి.. నర్మదా నది చుట్టూ 3,500 కిలోమీటర్లు నడిచివెళ్లి ప్రదక్షిణ చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 12న ప్రారంభమైన ఈ ప్రదక్షిణ ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిన్నారి కాలినడకన రోజు 25 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తోంది. మార్గమధ్యంలో ఎన్నో రాళ్లూరప్పలు, ముళ్లపొదలను దాటుకుంటూ.. ఈ చిన్నారి తన బుల్లి పాదాలపై ముందుకు సాగుతోంది. దీంతో ప్రజలు ఆ చిన్నారిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ బాలిక, చిన్న వయసులోనే ఇంత భక్తిని కనబరుస్తోందని మెచ్చుకుంటున్నారు. చిన్నారి ఇప్పటికే రెండు నెలల యాత్ర పూర్తి చేసుకుంది. ఈ ప్రదక్షిణ మరో రెండు నెలల పాటు సాగనుందని చిన్నారి కుటుంబ సభ్యులు చెప్పారు.