70 ఏళ్ల మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజస్థాన్ అళ్వర్లో సోమవారం జరిగిందీ ఘటన. తల్లిదండ్రులు కావాలన్న కల.. పెళ్లయిన 54 ఏళ్లకు నెరవేరగా ఆ వృద్ధ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఐవీఎఫ్ విధానంలో ఈ అద్భుతాన్ని సాకారం చేసిన వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
దేశ సేవలో నిమగ్నమై..
వృద్ధాప్యంలో తల్లిదండ్రులైన ఈ దంపతులు గోపీచంద్(75), చంద్రావతి(70). 1968లో వీరికి వివాహమైంది. అప్పట్లో గోపీచంద్ సైన్యంలో పనిచేసేవారు. పెళ్లయిన కొంతకాలానికి బంగ్లాదేశ్ యుద్ధం రాగా.. ఆ విధులపై పంపింది ప్రభుత్వం. ఫలితంగా చాలాకాలం ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. యుద్ధం ముగిశాక కూడా సైనిక విధుల్లో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో భార్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కావాలన్న గోపీచంద్, చంద్రావతి కల నెరవేరలేదు.
1983లో సైన్యం నుంచి పదవీ విరమణ పొందారు గోపీచంద్. తల్లిదండ్రులు కావాలన్న కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలని భార్యాభర్తలు అనుకున్నారు. అనేక మంది వైద్యుల్ని సంప్రదించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల అళ్వర్లోని ఓ ప్రైవేటు ఐవీఎఫ్ ఆస్పత్రి గురించి తెలుసుకున్నారు గోపీచంద్-చంద్రావతి. వెంటనే వెళ్లి అక్కడి వైద్యులను సంప్రదించారు. చికిత్స ఫలించింది. 70 ఏళ్ల వయసులో చంద్రావతి గర్భం దాల్చింది.
సోమవారం అళ్వర్లోని ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది చంద్రావతి. శిశువు 3.5 కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: 37ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా.. దటీజ్ నితీశ్!