తౌక్టే తుపాను కారణంగా అరేబియా సముద్రంలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన భారీ నౌక పీ-305లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 37కు చేరింది. గల్లంతైన మరో 38 మంది కోసం గాలింపు ముమ్మరం చేసింది నౌకాదళం. రాత్రిళ్లు సైతం గాలింపు చేపడుతోంది.
ఏరియల్ సర్చ్..
గల్లంతైన వారి కోసం గురువారం ఉదయం నుంచి ఏరియల్ సర్చ్ చేపట్టింది నౌకాదళం. ఇందు కోసం హెలికాప్టర్లను మోహరించింది. బార్గే పీ-305 మునిగిన ప్రాంతంలో హెలికాప్టర్లు గాలింపు చేపట్టనున్నాయి. ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ బీస్, ఐఎన్ఎస్ బెటా, ఐఎన్ఎస్ టెగ్లతో పాటు పీ8ఐ నౌకాదళ నిఘా విమానం, చెతాక్, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లతో పాటు మరిన్ని విహంగాలను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.
పీ-305 నౌకలో మొత్తం 261 మంది సిబ్బంది ఉండగా ఇప్పటి వరకు 186 మందిని రక్షించారు. టగ్బోట్ వరప్రదాలోని మరో ఇద్దరిని రక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ముంబయి తీరానికి తీసుకొచ్చాయి. మిగిలిన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
దర్యాప్తు..
తౌక్టే తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ నౌకను సముద్రంలో ప్రమాద ప్రాంతంలో ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించారు ముంబయి పోలీసులు. నౌకలో ఒకరు చనిపోయిన దానికి సంబంధించి ప్రమాద మృతి నివేదికను(ఏడీఆర్) నమోదు చేశారు.
ఇదీ చూడండి: తౌక్టే విలయం: ఆ నౌకలో 26 మంది మృతి