పోలీసుల గూడ్స్ గోదాములోనూ ఆయుధాలకు భద్రత లేదనే దానికి ఉదాహరణగా రాజస్థాన్‌లోని భిల్వారా పోలీస్ లైన్ వెపన్స్ బ్రాంచ్ అపవాదు మూటగట్టుకుంటోంది. ఇక్కడ నిల్వ ఉంచిన అనేక ఆయుధాలు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. అనేక పిస్టళ్లు, 12 బోర్ గన్స్, దేశీ కట్టా, రివాల్వర్, రైఫిల్ వంటి ఆయుధాలు మాయమవుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా భిల్వాడా పోలీస్ లైన్‌లోని ఆయుధాల శాఖలో దాదాపు 317 ఆయుధాలు మాయమయ్యాయి. వీటి బదులుగా కొన్ని నకిలీ ఆయుధాలను అందులో ఉంచారు. గన్ బ్యారెల్స్ స్థానంలో పైపులను ఉంచారు. ఈ ఘటనలో ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ ఆయుధ శాఖ ఇన్‌ఛార్జ్‌పై భిల్వారా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయుధాల భౌతిక తనిఖీల కోసం ఏర్పాటైన రెండు కమిటీలు మూడు నెలల పాటు విచారణ జరిపి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. ప్రభుత్వ ఆయుధాల శాఖ ఇన్‌ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ లాల్ 2022 అక్టోబర్ 31న పదవీ విరమణ చేయగా.. ఆయన రిటైర్మెంట్కు ముందే.. మరో హెడ్ కానిస్టేబుల్ మహావీర్ ప్రసాద్‌కు ఛార్జ్ ఇవ్వాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2022 జూలై 28న భిల్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదర్శ్ సిద్ధూ.. ఈ ఆయుధాల భౌతిక ధృవీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీ వెలువరించిన రిపోర్ట్ ప్రకారం సింగిల్, డబుల్ బ్యారెల్ రకానికి చెందిన 135 తుపాకులు, 12 బోర్ రకానికి చెందిన మూడు గన్స్, 8 పిస్టళ్లు సహా 317 ఆయుధాలు కనిపించకుండా పోయాయి. వీటిని రిజిస్ట్ర్లో సైతం నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. లెక్కలను తారుమారు చేసేందుకు పలు నకిలీ ఆయుధాలను అక్కడ ఉంచినట్లు తేలిందని చెప్పారు. చాలా కాలంగా పోలీసు లైన్ మాల్ ఖానాలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు పేరుకుపోయాయని వాటిలో కొన్ని ఆయుధాలు 40-50 ఏళ్ల క్రితంకు చెందినవని అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి లెక్కించగా కొన్ని కనిపించకుండా పోయాయి. దీంతో తనిఖీలు నిర్వహించిన సిబ్బంది.. నిందితులపై శాఖాపరమైన చర్యలతో పాటు పోలీసు కేసు కూడా నమోదు చేశారు.
ఇదీ చదవండి:ఈ పరికరంతో బైక్ చోరీలకు ఫుల్స్టాప్.. 100 కి.మీ దూరంలో ఉన్నా..
పుట్టినరోజున అడ్వాణీకి శుభాకాంక్షల వెల్లువ.. స్వయంగా ఇంటికి వెళ్లిన మోదీ