ఉత్తర్‌ప్రదేశ్ ఫరూఖాబాద్‌లోని ఓ జైలులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలులోని పోలీసు సిబ్బందిపై ఖైదీలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ ఖైదీ మరణించగా.. 30మంది పోలీసులు గాయపడ్డారు.
ఇదీ జరిగింది...
సందీప్ పాండే అనే ఖైదీ.. స్థానిక సఫై వైద్య కళాశాలలో డెంగీకి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వార్త ఆదివారం ఉదయం జైలులోని ఇతర ఖైదీలకు తెలిసింది. దీంతో వారు నిరసనకు దిగారు. జైలు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 30మంది పోలీసులు గాయపడ్డారు. శివం అనే ఖైదీ మరణించాడు. ఈ ఖైదీకి కూడా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే మృతిచెందాడని పోలీసులు చెప్పారు. అంతలోనే శివం చివరి క్షణాలకు సంబంధించిన ఓ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనకు బులెట్ గాయమైందని అందులో శివం తెలిపాడు.
జైలులో ఉద్రిక్త పరిస్థితులపై ఎస్పీ అశోక్ కుమార్ మీనా స్పందించారు.
"అదనపు పోలీసు దళం కావాలని ఈ రోజు ఉదయం 8:45కు మాకు సమాచారం అందింది. అధికారులు జైలుకు వెళ్లారు. 2012 కట్నం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సందీప్ పాండే అనే వ్యక్తికి ఈ నెల 5న డెంగీ సోకిందని తెలిసింది. చికిత్స పొందుతూ అతడు శనివారం మరణించాడు. ఈ రోజు ఉదయం 8:30గంటలకు.. ఖైదీలకు టీ అందిస్తున్న సమయంలో డిప్యూటీ జైలర్‌పై వాళ్లు దాడి చేశారు. ఆ తర్వాత రాళ్లు రువ్వారు. నేరపూరిత ఉద్దేశంతో బ్యారక్‌కు నిప్పంటించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనలో డిప్యూటీ జైలర్ సహా 30మంది పోలీసులు గాయపడ్డారు."
--- అశోక్ కుమార్, ఎస్పీ.
మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ఘటనపై విచారణ చేపట్టి, సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ఇదీ చూడండి:- మహిళా ఖైదీకి పండంటి ఆడబిడ్డ- జైలులో సంబరాలు