రాజస్థాన్ రాజధాని జైపుర్‌లోని జేకే లోన్ ఆసుపత్రి.. వార్తల్లో నిలిచింది. అందుకు కారణం.. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలుడు. వైద్య రంగానికే ఆశ్చర్యం కలిగించేలా ఆ చిన్నారి రక్తం తెలుపు రంగులో ఉంది. అలా ఎందుకు ఉందో వైద్యులే తేల్చలేని పరిస్థితి.
కొద్దిరోజుల క్రితం వింత వ్యాధితో బాధపడుతోన్న 3 నెలల చిన్నారిని జైపుర్‌లోని జేకే లోన్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల కోసం బాలుడి రక్తం తీసుకోగా.. తెల్లటి రంగులో కనిపించింది. దీంతో అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. రక్తం తెల్లగా ఎందుకుంది? ఆ బాలుడు ఎలా జీవించగలుగుతున్నాడు? వంటి అనేక ప్రశ్నలు వైద్యుల మెదళ్లను తొలిచివేశాయి.
సాధారణంగా రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాల ద్వారా మానవుని శరీరంలోకి ఆక్సిజన్ ప్రవేశిస్తుంది. మరి ఆ రక్తమే తెల్లగా ఉంటే..? జీవశాస్త్రంలో దీనిపై ఇంతకముందు ఏమైనా పరిశోధనలు జరిగాయా? ఇలాంటివి వైద్యుల ముందు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
" బాలుడి రక్తం తెల్లగా ఉంది. ఇటువంటి అరుదైన వ్యాధిని చూడటం ఇదే మొదటిసారి. ఆసుపత్రిలో చేరిన వెంటనే రక్త నమూనాలను సేకరించగా తెల్లగా కనిపించింది. ఇది చాలా అరుదైన కేసు."
- డాక్టర్ అశోక్ గుప్తా, అరుదైన వ్యాధుల విభాగాధిపతి- జేకే లోన్ ఆసుపత్రి.
సాధారణంగా ఈ వయస్సు పిల్లల్లో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. అయితే ఈ బాలుడిలో మూడు నెలలకే కొవ్వుశాతం అధికంగా ఉందని.. డైస్లీపీడీయా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. దాని వల్లే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కళ్లు లేకపోయినా 40 ఏళ్లుగా మిల్లు నడుపుతూ..