Missing EVM Machines in India: కర్ణాటక శాసనసభ్యుడు, కాంగ్రెస్ నేత హెచ్కే పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2016-2018 మధ్య మొత్తం 19 లక్షల ఈవీఎంలు మాయమైనట్లు ఆరోపించారు. ఎన్నికల సంస్కరణలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ప్రశ్నించగా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ వైఖరి వల్ల ఈవీఎంలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే అనుమానం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
"ఈ వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల క్రితం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఓ పార్టీకే భారీగా మద్దతు పలికారు. కేబినెట్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 53 మంది మంత్రుల్లో 22 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీని గురించి ప్రజలు ఏమనుకోవాలి? ఈవీఎంలపై చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎన్నికల సంఘమా లేక ప్రభుత్వమా?"
-హెచ్కే పాటిల్, కాంగ్రెస్ నేత
పాటిల్ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరీ.. ఈ ఆరోపణల వెనుక కారణంపై పాటిల్ స్పష్టత ఇస్తే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులకు సమన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారికి లేఖ రాస్తానని తెలిపారు. మరోవైపు ఎన్నికల అవకతవకలపై స్పందిస్తూ.. ఎన్నికల వ్యవస్థ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ప్రజలు, రాజకీయ పార్టీలే ఇందుకు కారణం అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 17 ఏళ్లకే ఆంగ్లేయులకు వణుకు పుట్టించిన 'అనంతుడు'