Opposition Parties Meeting in Patna : 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా 17 పార్టీలు ఏకమయ్యాయి. ఇందుకోసం శుక్రవారం బిహార్ రాజధాని పట్నా వేదికగా విపక్షాలు ఉమ్మడి సమావేశం నిర్వహించాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నిర్వహించిన ఈ సమావేశంలో.. బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై తీవ్రంగా చర్చించారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో మొత్తం 17 పార్టీలు ఉన్నా.. ప్రస్తుత సమావేశానికి 14 పార్టీలు మాత్రమే హాజరయ్యాయని తెలిసింది.
2019 Election Results : తాజాగా భేటీ అయిన పార్టీల లోక్సభ బలాన్ని పరిశీలిస్తే.. మొత్తం 543 స్థానాలకు గానూ విపక్షాల అన్నింటి బలం 200లోపే. అధికార బీజేపీ 303 స్థానాలతో బలంగా ఉంది. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో కేవలం 50కి పైగా సీట్లకే పరిమితమైంది. అంతకుముందు 2014లో పార్టీ చరిత్రలోనే అత్యల్పంగా 44 స్థానాలనే గెలుచుకుంది. అయితే, తాజాగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గెలుపు.. అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఆదరణ లభించడం వల్ల కాంగ్రెస్లో జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని ధీమాగా ఉంది హస్తం పార్టీ. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీల్లో టీఎంసీ, డీఎంకే, జేడీయూ మాత్రమే డబుల్ డిజిట్ స్థానాలను సాధించాయి. ఆర్జేడీ, సీపీఐ (ఎంఎల్) పార్టీలు కనీసం ఒక్క సీటును కూడా సంపాదించలేదు. మరోవైపు శివసేన 18 స్థానాల్లో గెలిచినా.. ఆ పార్టీ రెండుగా చీలిపోయింది.
విపక్షాల సమావేశానికి హాజరైన పార్టీలు | 2019లో గెలుచుకున్న ఎంపీ స్థానాలు |
కాంగ్రెస్ | 52 |
డీఎంకే | 24 |
తృణముల్ కాంగ్రెస్ | 22 |
జనతాదళ్ (యునైటెడ్) | 16 |
సమాజ్వాదీ పార్టీ | 5 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 5 |
రాష్ట్రీయ జనతా దళ్ | 4 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్ట్) | 3 |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) | 2 |
ఆమ్ ఆద్మీ పార్టీ | 1 |
ఝార్ఖండ్ ముక్తి మోర్చా | 1 |
శివసేన | 18 (కానీ పార్టీ రెండుగా చీలిపోయింది) |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) | 0 |
పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ | 0 |
విపక్షాలు ఉమ్మడి పోరు
పట్నాలో బీజేపీయేతర పార్టీల సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని చెప్పారు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్ కుమార్. జులై 10 లేదా 12న శిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మరోసారి విపక్షాలు సమావేశం అవుతాయని వెల్లడించారు నీతీశ్. ఐక్యపోరాటం సాగించేందుకు ఉమ్మడి అజెండాను అదే భేటీలో ఖరారు చేస్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని.. తాము మాత్రం జాతి ప్రయోజనాల కోసమే ఏకమయ్యామని చెప్పారు నీతీశ్.