కర్ణాటక సుప్రసిద్ధ నటుడు, దివంగత పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar news) ద్వాదశ దినకర్మ కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోస్‌లో పునీత్ సమాధి (Puneeth Rajkumar death date) ఉన్న ప్రాంతంలో మంగళవారం.. పూజలు చేశారు. పునీత్ భార్య అశ్వినీ, కూతుర్లు ధృతి, వందిత సహా కుటుంబ సభ్యులు పునీత్‌కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కంఠీరవ స్టూడియోస్‌లో ఆహార పంపిణీ చేపట్టారు. పునీత్ సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, భార్య అశ్వినీ.. అభిమానులకు భోజనం వడ్డించారు. 40 వేల మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరందరికీ భోజనం ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది చెఫ్‌లు వంటలను సిద్ధం చేశారు. వెజ్, నాన్-వెజ్ వెరైటీలను అందుబాటులో ఉంచారు.
రక్తదాన, నేత్రదాన శిబిరాలు..
భోజనంతో పాటు రక్తదాన శిబిరం, నేత్రదాన శిబిరాలనూ కంఠీరవ స్టూడియోస్‌లో ఏర్పాటు చేశారు. నటుడు శివరాజ్ కుమార్ ఈ శిబిరాలను ప్రారంభించి.. రక్తదానం చేశారు. అభిమానులు సైతం రక్తదానం చేసి.. నేత్ర దానానికి సంబంధించిన పత్రాలపై సంతకం చేశారు.
భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో.. ముందుగానే కంఠీరవ స్టూడియోస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఐదుగురు ఏసీపీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు సహా.. 1,123 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్(46) కన్నుమూశారు. వ్యాయామాలు చేస్తూ గుండెపోటుతో మరణించారు.
ఇదీ చదవండి: