బర్డ్ ఫ్లూ(Bird flu in India)తో 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో చనిపోయాడు. దీంతో బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌కు వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని వైద్యనిపుణులు వారికి సూచించారు. భారత్‌లో బర్డ్ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి. హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. అనంతరం నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హర్యానాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది.
బర్డ్ ఫ్లూను హెచ్5ఎన్1 వైరస్ లేదా ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది పక్షులు, కోళ్లలో వస్తుంది. బర్డ్ ఫ్లూ ఓ మనిషికి సోకడం భారత్‌లో ఇదే తొలిసారి. ఈ నెల 15న బర్డ్ ఫ్లూ వైరస్ జాతి అయిన హెచ్5ఎన్6 స్ట్రెయిన్ చైనాలో ఓ వ్యక్తికి సోకినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో బర్డ్ ఫ్లూ విరుచుకుపడింది. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇది వెలుగుచూడడంతో వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు మృతి చెందాయి. పంజాబ్‌లోనే 50,000 పక్షులు మృతిచెందాయి. పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వల్ల ఎక్కువగా కాకులు, బాతులు మృతిచెందాయి. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడం, ఇన్‌ఫెక్షన్‌ను కలిగించడం తక్కువ శాతం అని, పెద్ద ప్రమాదకరం కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: 'మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చలేవు'