Tractor Accident several Dead: గుంటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురు మృతి.. మరో ఏడుగురికి గాయాలు.. - గుంటూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Tractor Accident several Dead: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వట్టిచెరుకూరు సమీపంలో ఓ ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు మరణించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ.. మరో మహిళ గరికపూడి సలోమి మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. బాధితులు ప్రత్తిపాడు మండలం కొండెపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో నాగమ్మ, మేరమ్మ, రత్నకుమారి, నిర్మల, సుహాసిని, ఝాన్సీరాణి, సలోమీ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కొండెపాడు, జూపూడిలో విషాదచాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.