టెండర్ ఇవ్వలేదని కాంట్రాక్టర్ కొత్త స్కెచ్.. 21 కి.మీ రోడ్డు చోరీ.. ఆ తర్వాత..
🎬 Watch Now: Feature Video
Road Theft In Rohtak Haryana : హరియాణా.. రోహ్తక్ జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. ఓ కాంట్రాక్టర్ దాదాపు 21 కిలో మీటర్ల రోడ్డును దొంగిలించాడు. తారును మెషీన్లతో పీకేశాడు. రోడ్డు దెబ్బతినడం వల్ల ప్రస్తుతం.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. కొత్త రోడ్డు నిర్మించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
రోహ్తక్ జిల్లా మహమ్ ప్రాంతంలోని ఖరెటీ నుంచి బైంసీ వరకు, బెడ్వా నుంచి పుట్టీ వరకు, భైణీభరో నుంచి జతాయీ వరకు దాదాపు 21 కిలో మీటర్లు ఉన్న మూడు రోడ్లను నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం టెండర్లను కూడా పిలిచారు. మోహిత్ అనే కాంట్రాక్టర్ టెండర్ గెలిచాడు. అయితే, బ్యాంకు గ్యారంటీ సమర్పించకపోవడం వల్ల అతడికి టెండర్ కేటాయించలేదు.
దీంతో అసంతృప్తికి గురైన మోహిత్.. దాదాపు రూ. 18 లక్షల విలువైన 21 కిలోమీటర్ల తారు మెటీరియల్ను.. మెషీన్లతో పెకిలించి దొంగిలించాడు. అనంతరం పరారయ్యాడు. దీనివల్ల రెండు రోడ్లు దెబ్బతిన్నాయి. అయితే తరచూ ప్రమాదాలు జరుగుతుండటం వల్ల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెషీన్లతో తారును తీస్తున్నప్పడు.. కొత్త రోడ్డు వేయడానికి పాతది తీసేస్తున్నారేమో అని అడ్డుచెప్పలేదని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఖరెంటీ గ్రామ మాజీ సర్పంచ్ జగ్బీర్ పహిల్వాన్ తెలిపారు. నిందితుడిపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
అయితే రోడ్డు తీసేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా మళ్లీ నిర్మించకపోవడం వల్ల అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన వ్యవసాయ మార్కెట్ బోర్డు జేఈ జిజేంద్ర నందల్.. బ్యాంకు గ్యారంటీ సమర్పించనందునే టెండర్ కేటాయించలేదని.. ఈ విషయంలో కాంట్రాక్టర్ నియమాలను అతిక్రమంచాడని చెప్పారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.