Cyber Crimes Increasing In Telangana : క్షణమాగండి, ఆలోచించండి, స్పందించండి. ఈ సూత్రాన్ని పాటిస్తే ప్రజలు ఆన్‌లైన్ మోసాల నుంచి బయట పడవచ్చు. డిజిటల్ మోసాలపై ఆందోళన చెందకుండా, అప్రమత్తతతో ఉంటే చాలు. పోలీసులమని, సీబీఐ అధికారులమని, నార్కోటిక్స్ విభాగాధికారులమని, ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మబలికి వ్యక్తిగత విషయాలను అడుగుతారు. ఇప్పటికిప్పుడు తాము చెప్పినట్లు చేయకపోతే అరెస్టు తప్పదని మానసికంగా ఒత్తిడి చేస్తుంటారు. ఇలాంటి ఘటనల పట్ల ఎవరూ భయపడకూడదు. 1930 నంబరుకు, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
అవగాహన కార్యక్రమాలపై ఫోకస్ : డిజిటల్ నేరాలపై ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించడంతో సైబర్ క్రైమ్ బ్యూరో మరింత అప్రమత్తమైంది. మోసం జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని, ప్రజల్లో అవగాహన పెంచడంతోనే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించడం, వ్యక్తిగతంగా సందేశాలు పంపించడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయవచ్చని యోచిస్తున్నారు.
'హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వారే టార్గెట్ - సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి సర్వం దోచేస్తారు'
నిత్యం ఏదో ఒక చోట ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీడియో కాల్ చేస్తూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. దీన్ని నమ్మిన చాలా మంది డబ్బును బదలాయిస్తూ మోసాలకు గురవుతున్నారు. ఇటువంటి ఘటనలపై అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ క్రైమ్ అధికారులు అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవొద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పిన్ నెంబరు, వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు. సెల్‌ఫోన్ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదముంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1790 సైబర్ నేరాల కేసులు నమోదు కాగా, బాధితులు భారీ స్థాయిలో నగదు కోల్పోయారు. కొందరు సమయానికి ఫిర్యాదులు చేయడంతో సుమారు రూ.3 కోట్లకు పైగా నగదు బదిలీ కాకుండా పోలీసులు నిరోధించగలిగారు.
- రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి నీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, తాను చెప్పిన నెంబరుకు డబ్బును పంపిస్తే పరిశీలించి తిరిగి మీ ఖాతాలో జమ చేస్తామని నమ్మబలికారు. దీన్ని నమ్మిన బాధితుడు విడతల వారీగా రీ.1.43 కోట్లు నేరగాడు చెప్పిన ఖాతాలో వేశాడు. నెలలు గడుస్తున్నా తిరిగి తన ఖాతాలో డబ్బు జమ కాలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి బంగారంపై పెట్టుబడి పెడితే రెండింతలు అవుతుందని వచ్చిన సందేశాన్ని నమ్మి విడతల వారీగా రూ.33.63 లక్షలు గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన ఖాతాలో వేశాడు. మొదటగా రెట్టింపు డబ్బులను చెల్లించాడు. దీన్ని నమ్మి భారీ మొత్తంలో మరోసారి నగదు జమ చేయగా, తర్వాత వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు.
- కరీంనగర్‌కు చెందిన వ్యక్తికి గుర్తు తెలియని మహిళ నుంచి కాల్ వచ్చింది. 'మీ ఆధార్ కార్డు వివరాలతో మీకు తెలిన వ్యక్తి లోన్ తీసుకున్నాడు.' దానికి మీరే బాధ్యత వహించాలి' అని తెలిపింది. ఇంటి చిరునామా, ఇతర వివరాలు అన్ని తెలపడంతో కంగుతిన్న బాధితుడు వెంటనే అనుమానం వచ్చి ఎదురు ప్రశ్నించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో చేసిన వ్యక్తి ఫోన్ పెట్టేశారు.
- గోదావరిఖనికి చెందిన ఓ వ్యాపారి తన సెల్‌ఫోన్‌కు వచ్చిన లింకును తెరవగానే తన ఖాతాలోని డబ్బు సైబర్ నేరగాడి ఖాతాలోకి జమైంది. తక్షణమే గుర్తించి 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో కొంత మేరకు నగదు బదిలీ కాకుండా ఆపారు. ఇదే తరహాలో ఓ సింగరేణి ఉద్యోగి నుంచి కూడా డబ్బును సైబర్ నేరగాళ్లు బదలాయించుకున్నారు.
ఏపీకే ఫైళ్లను పంపిస్తారు - క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ చేస్తారు
రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి!