CI Anju Yadav Slaps Janasena Leader: జనసేన నాయకులపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్.. వీడియో వైరల్ - ap latest news
🎬 Watch Now: Feature Video
Srikalahasti CI Anju Yadav Slapped Janasena Activist: జనసేన నాయకులపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ రెచ్చిపోయారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన నాయకులపై.. సీఐ అంజు యాదవ్ అత్యంత దురుసుగా ప్రవర్తించారు. ఓ నాయకుడి రెండు చెంపలు వాయించారు. ఆ తర్వాత నాయకులను వెనక్కి గెంటేశారు. అయినా నిరసన కొనసాగించిన జనసైనికులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే బైఠాయించి జై జనసేన అంటూ హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనసేన నాయకులను వారి ఇళ్లకు తరలించి గృహనిర్బంధం చేశారు.
కాగా మరోవైపు జనసేన నాయకుడి చెంపలు వాయించిన సీఐ అంజు యాదవ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతియుత నిరసనలకు దిగితే భౌతికదాడి చేయడం ఏంటని జనసేన నేతలు మండిపడుతున్నారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో సీఐ దురుసుగా ప్రవర్తించారని.. ఇప్పటికీ తీరు మార్చుకోకపోవడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, దాడులతో ఆందోళనలను ఆపాలనుకుంటే సాధ్యం కాదని తేల్చిచెప్పారు.
అంజు యాదవ్‌ను విధుల నుంచి తొలగించాలి: శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌ను విధుల నుంచి తొలగించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి బినామీగా వ్యవహరిస్తూ... ఆందోళనలు చేస్తున్న వారిపై రెచ్చిపోవడం ఆమెకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆమెను ఉద్యోగంలో నుంచి తప్పించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. తిరుపతిలో నిరసనకు సిద్ధమైన జనసేన నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.