ఒకే వేదికపై 2,200 జంటల పెళ్లి.. 5లక్షల మందికి విందు.. సీఎం సమక్షంలోనే! - 2222 couples have tied the knot
🎬 Watch Now: Feature Video
సామూహిక వివాహాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్‌లో ఒకే వేదికపై 2,200 జంటలు ఒక్కటయ్యాయి. బారాన్ జిల్లాలోని బట్వాడ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ ఆచారాల ప్రకారం 2,111 జంటలు ఏడడుగులు నడిచాయి. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. 111 మంది జంటలు నిఖా జరుపుకొన్నాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో పాటు మంత్రి ప్రమోద్ జైన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సామూహిక వివాహ వేడుకను విజయవంతం చేయడంలో మంత్రి ప్రమోద్‌తోపాటు బారాన్ కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రీ మహావీర్ కల్యాణ్ గౌశాల సంస్థాన్ సభ్యులు కీలక పాత్ర పోషించారని సీఎం కొనియాడారు. నిరుపేద ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయడం పుణ్యమని ఆయన అన్నారు.
12వేల మంది కలిసి వంట.. ఐదు లక్షల మందికి పెళ్లి భోజనాలు
ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది ప్రజలు విచ్చేశారు. వారందరికీ నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేశారు. ఐదు లక్షల మందికి పైగా పెళ్లి భోజనాన్ని ఆస్వాదించారు. దాదాపు 12,000 మంది కలిసి భోజన ఏర్పాట్లు చేశారు. 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. కన్యాదాన సమయంలో వధువులకు ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందించింది.