Nara Lokesh Open Letter to CM Jagan: ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలి.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Open Letter to CM Jagan: రైతులను ఆదుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సాగు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు, పొలాల్లో ఉరి వేసుకుంటోన్న సంఘటనలను వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నారా లోకేశ్ లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే.. ''వర్షాభావ పరిస్థితులతో ఎండిన పంటలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పంటల్ని రైతులు తగలబెడుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. వరి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటున్న రైతుల్ని చూస్తే హృదయం ద్రవించిపోతోంది. నీరు వదిలి పంటల్ని కాపాడాలంటూ రైతులు.. అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నారు. సాగునీటి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ రైతుల్లేని రాష్ట్రం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు ఎన్నడూ లేవు. తొలిసారి అతి తక్కువ వర్షపాతం మీ పాలనలోనే నమోదైంది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో విఫలమైంది మీ ప్రభుత్వం. పెన్నా, తుంగభద్ర కాలువల కింద కృష్ణా డెల్టాలోనూ సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్లు, బావుల నుంచి నీరందించి పంటలు కాపాడుకుందామంటే కరెంటు కోతలతో సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులని తక్షణమే ఆదుకోవాలి.''