Nara Bhuvaneswari and Brahmani in Candlelight Rally: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?: నారా బ్రాహ్మణి - ఏపీలో నారా బ్రాహ్మణి పర్యటన
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 7:36 PM IST
|Updated : Sep 17, 2023, 6:28 AM IST
Nara Bhuvaneswari and Brahmani in Candlelight Rally: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో ఆ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పాల్గొన్నారు. తిలక్ రోడ్డు సాయిబాబా గుడి నుంచి శ్యామలానగర్ రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది. కొవ్వొత్తుల ర్యాలీలో(Candlelight Rally) పాల్గొనేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రిగా నిజాయతీతో పాలన సాగించిన చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేయడం అన్యాయమని మహిళలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మిణి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ మండిపడ్డారు.
42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను కక్షపూరితంగా జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారని.. ఆయన ఎప్పుడూ ప్రజల బాగు కోసం కష్టపడేవారని బ్రాహ్మణి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మద్దతు తెలుపుతున్నారని బ్రాహ్మణి వెల్లడించారు. జాతీయ నేతలు సైతం ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నారని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని నారా బ్రాహ్మణి వెల్లడించారు. ఇలా జరుగుతుందని మేం ఎప్పుడూ ఊహించలేదన్న ఆమె... యువతకు ఉపాధి కల్పించడమే చంద్రబాబు చేసిన తప్పా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.