కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎంపై రాళ్ల దాడి.. తలకు గాయం.. పది రోజుల్లోనే రెండోసారి! - Stone pelting on Former Karnataka deputy CM
🎬 Watch Now: Feature Video
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత జి. పరమేశ్వర తలకు గాయమైంది. ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న ఆయనపై.. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. తుమకూరు జిల్లాలోని కొరటగెరె నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. బైరెనహళ్లి ప్రాంతంలో కొందరు కార్యకర్తలు పరమేశ్వరను భుజాలపై ఎత్తుకుని సంబరాలు చేస్తున్నారు. ఆయనపై పూల వర్షం కురిపిస్తూ.. జేసీబీ సాయంతో గజమాల వేశారు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి.. పరమేశ్వరపై రాళ్లతో దాడి చేశాడు. దీంతో ఆయన తలకు గాయమైంది. దీంతో పరమేశ్వర తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే అక్కడున్న వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం పరమేశ్వరకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. పరమేశ్వర.. కొరటగెరె నియోజక వర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగారు. గతంలో ఆయన కేపీసీసీ చీఫ్గాను పనిచేశారు. అంతకుముందు కూడా పరమేశ్వరపై రాళ్ల దాడి జరిగింది. ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు ర్యాలీగా వెళుతున్న సందర్భంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై రాళ్ల దాడి చేశాడు. ఆ సయయంలో పరమేశ్వరకు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఓ మహిళ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడింది.