Girijans Unhappy with MLA: ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఆలస్యంగా ఎమ్మెల్యే.. గిరిజనుల అసహనం - Alluri Sitaramaraju District
🎬 Watch Now: Feature Video
Girijans Unhappy with MLA: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, కలెక్టర్, ఏఎస్పీ ఎవరూ హాజరుకాలేదు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు రావడంతో ఆదివాసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ముందుగా ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆదివాసి జెండాను ఆవిష్కరించి.. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు తీగల బాబురావు మాట్లాడుతూ.. మన్యంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదని, విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని అన్నారు. పిల్లలకు ఆశ్రమ పాఠశాలలో సరైన తిండి పెట్టడం లేదని విమర్శించారు. పిల్లలు ఉదయం నుంచి ఎంతో ఓపికతో ఎదురు చూశారని ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. మరో ఆదివాసి నాయకుడు వెదుల్ల లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన చట్టాలను రెవిన్యూ అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదని.. దీంతో గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కడుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
TAGGED:
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం