Facts on Skill Development: 'ఆరోపణలు నిరూపించలేక.. విరాళాలతో ముడిపెడతారా..' స్కిల్ కేసు వాస్తవాలతో టీడీపీ పుస్తకం
🎬 Watch Now: Feature Video
Facts on Skill Development : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు నిరూపించలేని వైసీపీ.. చివరకు పార్టీ అధికారిక ఖాతాకు వచ్చిన ఎన్నికల విరాళాలకు ముడిపెడుతోందని తెలుగుదేశం నేతలు దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు 'స్కిల్ డెవలప్‌మెంట్‌పై వాస్తవాలు' పుస్తకం విడుదల చేశారు. వాస్తవాలన్నీ ఆ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఫలానా ఖాతాలోకి ఒక్క రూపాయి మళ్లిందని రుజువులు చూపగలరా అని నిలదీశారు.
'స్కిల్ డెవలప్‌మెంట్‌పై వాస్తవాలు' పుస్తకం విడుదల చేసిన అచ్చెన్నాయుడు.. వైసీపీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అరెస్టు కుట్రలు అని తెలిపారు. స్కిల్ కేసులో తాము ఎలాంటి తప్పు చేయలేదని, తప్పు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్కిల్ కేసులో రోజుకో లెక్క చెబుతున్నారు.. మా పార్టీ ఖాతాలో డబ్బులు పడ్డాయని అంటున్నారు.. మిగతా పార్టీలకు వచ్చినట్లే మా పార్టీకీ విరాళాలు వచ్చాయి అని అచ్చెన్నాయుడు వివరించారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌పై జీవో ఇచ్చిన నీలం సాహ్ని పేరు కేసులో లేదని, నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్‌చంద్రారెడ్డి, అజేయ కల్లం నిందితులు కాదా?.. విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మాత్రమే తప్పు చేశారా? అని టీడీపీ నేత ధూళిపాళ్ల ప్రశ్నించారు. ఫలానా ఖాతాలోకి ఒక్క రూపాయి మళ్లిందని రుజువు చూపగలరా?.. పార్టీకి వచ్చిన డబ్బును స్కిల్ డబ్బంటూ కోర్టుకు చెబుతున్నారని మండిపడ్డారు. పాలసీ నిర్ణయం చేసిన చంద్రబాబును అరెస్టు చేశారే తప్ప.. బాధ్యులైన అధికారులను మాత్రం ఏమీ అనడం లేదని తెలిపారు. స్కిల్ కేసులో 20 నెలలుగా ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు.. స్కిల్ కేసులో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో పస లేదు అని ధూళిపాళ్ల అన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని, డిజైన్‌టెక్ ద్వారానే కార్యక్రమాలు చేస్తున్నామని సీమెన్స్ చెప్పిందని గుర్తు చేశారు. యువతకు నైపుణ్యం కల్పించడం చంద్రబాబు చేసిన తప్పా.. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు.