ప్రమాదకరంగా వంతెనలు - కొత్తవి నిర్మించాలంటూ స్థానికుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Bridges damaged in Gannavaram Constituency: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సుదీర్ఘ విస్తీర్ణం కలిగిన ఏలూరు పంట కాలువపై ఉన్న పైవంతెనలు శిథిలావస్థకు చేరాయి. ప్రధానంగా పెద్దఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు వంతెనలు అధ్వానంగా మారాయి. వంతెనల చుట్టుపక్కల గోడలు కూలిపోయి ప్రమాదకరంగా మారాయి. ఇంత దారుణంగా వంతెనలు ఉన్నా సరే అధికారులు కనీస మరమ్మతులు చేపట్టక పోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. రైతులు ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే సమయంలో నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు.
రాత్రి వేళ వంతెనపై ఏర్పడిన గుంతల్లో పడి చాలామంది ప్రమాదాల బారిన పడి, తీవ్రంగా గాయాలపాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న వంతెనలు చాలా చిన్నవిగా ఉన్నాయని, పెద్ద పెద్ద వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా పెరుగుతున్న జీవన శైలికి అనుగుణంగా పెద్ద వంతెనలు నిర్మించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చుట్టపక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.