TOLLYWOOD CELEBRITIES MEET CM REVANTH : ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సినీ ప్రముఖుల భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు తరువాత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొన్నా కొద్ది సేపటిలోనే సమావేశం ముగిసింది.
అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నట్లు ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో ఫిల్మ్ ఇండస్ట్రీ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. డ్రగ్స్‌ని కట్టడి చేయడంతో పాటు, మహిళా భద్రతపై ప్రచారంలో చొరవ చూపాలని, ఆధ్యాత్మిక, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.
"సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంది. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలి. మహిళల భద్రత, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ప్రమోట్ చేయాలి. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలి. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటాం. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే". - రేవంత్‌రెడ్డి, తెలంగాణ సీఎం
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలు, బెనిఫిట్‌షోలు, సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించి నిర్ణయించాలని తెలంగాణ సీఎం సూచించారు. సినీ పరిశ్రమ తరఫున తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వినతిపత్రం అందజేసింది.
మరోసారి భేటీలో చర్చిస్తాం: హైదరాబాద్‌ను సినీ పరిశ్రమకు అంతర్జాతీయ హబ్‌గా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనేది కేవలం అపోహలేనని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అంశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తెచ్చామని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమన్నారు. సినీ పరిశ్రమ అంశాలను మరోసారి భేటీలో చర్చిస్తామని, టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్న విషయాలని దిల్ రాజు అన్నారు.
తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో స్పందన వస్తోందని, దీనిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని రేవంత్‌రెడ్డి చెప్పారని, హైదరాబాద్‌లో హాలీవుడ్ చిత్రీకరణలు జరిగేందుకు సలహాలు కోరారని పేర్కొన్నారు. చిత్రీకరణలకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏర్పాట్ల గురించి అడిగారని, ఎఫ్‌డీసీలో చర్చించి తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తామని చెప్పారు.
సినీ ప్రముఖులు ఏం అన్నారంటే?: అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో నిర్మాణం ఉండాలని హీరో నాగార్జున సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తేనే సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తన కోరిక అని వెల్లడించారు. అందరు సీఎంలు సినీ పరిశ్రమను బాగానే చూసుకున్నారని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా చూసుకుంటోందని, హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు కోరారు. ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందని నటుడు, నిర్మాత మురళీమోహన్ వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని, సినిమా రిలీజ్‌లో పోటీ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ తెలిపారు.
ఈ సమావేశంలో అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, సి. కల్యాణ్, నాగవంశీ, గోపీ ఆచంట ఉన్నారు. BVS ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీ మోహన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. హరీశ్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేశ్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు.
'అధికంగా వసూళ్లు చేయడం బాధాకరంగా ఉంది' - సీఎం నిర్ణయంపై ఎగ్జిబిటర్ల స్పందన
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - సీఎం రేవంత్ రెడ్డి