World Diabetes Day 2023 : మధుమేహం.. దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంతకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతూ వస్తుంటుంది. కాబట్టి గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం కీలకం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహం బారినపడకుండా కాపాడుకోవచ్చు.
అయితే ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరి టైప్-1 షుగర్ బారిన పడ్డవారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలా? పెళ్లి చేసుకుంటే ఇబ్బంది ఉంటుందా? మధుమేహాన్ని పూర్తి రివర్స్ చేయవచ్చా? ఈ సందేహలన్నింటిపైన ఆరోగ్య నిపుణులు స్పష్టత ఇచ్చారు. అవి వారి మాటల్లోనే..
జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందేనా?
Type 1 Diabetes Treatment : "టైప్-1 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కేవలం ఇన్సులిన్ మాత్రమే వాడాలి. ట్యాబ్లెట్లు వాడకూడదు. ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే ఇన్సులిన్‌తోపాటు మెట్‌ఫామిన్ లాంటి ట్యాబ్లెట్లు వాడాలి. ఇన్సులిన్‌ను నాలుగుసార్లు మాత్రమే తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో రెండుసార్లు తీసుకోవాలి. జీవితాంతం ఇన్సులిన్‌తోనే చికిత్స పొందాలి. వైద్యుల సలహా లేకుండా ఇన్సులిన్ తీసుకోవడం ఆపకూడదు" అని నిపుణులు రవిశంకర్ ఇరుకులపాటి తెలిపారు.
పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయా?
Type 1 Diabetes Tips : "టైప్-1 డయాబెటిస్ బారినపడ్డ వాళ్లు పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు. అందరిలానే పెళ్లి చేసుకోవచ్చు. అయితే షుగర్, కొలెస్ట్రాల్, బీపీ అదుపులో ఉంచుకోవాలి. వాటిని సరిగ్గా అదుపులో ఉంచుకుంటే ఎలాంటి భయం లేకుండా వివాహం చేసుకోవచ్చు" అని నిపుణులు రవిశంకర్ ఇరుకులపాటి చెప్పారు.
మధుమేహాన్ని పూర్తిగా రివర్స్ చేయవచ్చా?
How To Reverse Diabetes Permanently : "సాధారణంగా మధుమేహం ఉందని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా రివర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలుత హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకోవాలి.హెచ్‌బీఏ1సీ ఎంత ఉందనేది చూడాలి. ఆ తర్వాత బీఎంఐ నిర్ధరించాలి. 24.9 కన్నా బీఎంఐ ఎక్కువగా ఉంటే ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. పదిశాతం బరువు తగ్గాలి. అప్పుడే మధుమేహాన్ని రివర్స్ చేయవచ్చు" అని సీనియర్ ఆరోగ్య నిపుణులు కె.ప్రవీణ్ కుమార్ చెప్పారు.
డయాబెటిస్ మందులు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయా..? నిజమెంత?
ఇలా చేస్తే షుగర్ వ్యాధి రాదు! ప్రీడయాబెటిస్ నుంచి ఎలా తప్పించుకోవాలి?