Mother and children missing in Kadapa district: కడపలో వరుస మిస్సింగ్ కేసులు పోలీసులకు కలవరపెడుతున్నాయి. తాజాగా కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి, బిడ్డలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన తల్లీ, బిడ్డలు.. అమ్మవారింటికి వెళ్తామని చెప్పారు. కానీ అక్కడకు వెళ్లలేదు. ఇటు ఇంటికి కూడా రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా కొద్దిరోజుల క్రితం కడపలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న అదృశ్యమై 10 రోజుల తర్వాత శవమై కనిపించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి మరి కొంతమందిని విచారిస్తున్నారు. ఇంతలోనే కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీ బిడ్డలు అదృశ్యమైన ఘటన పోలీసులను కలవరపెడుతోంది. పోలీస్ బృందాలు, కుటుంబ సభ్యులు తల్లీ బిడ్డల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అసలు ఏం జరిగిందంటే: వైయస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అక్బర్, జరీనాలకు కొన్నేళ్ల క్రిందట వివాహమైంది. సయ్యద్ అక్బర్ భవన నిర్మాణ పని చేస్తూ జీవిస్తున్నాడు. సయ్యద్ అక్బర్, జరీనా దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
ఇవాళ భర్త భవన నిర్మాణ పనికి వెళ్లగా.. జరీనా తన సోదరుడు అన్వర్ బాషాకు ఫోన్ చేసి.. తనను కడప మోచంపేటలో ఉన్న వాళ్ల అమ్మ ఇంట్లో దించాలని చెప్పింది. దీంతో సోదరుడు వచ్చి.. తన సోదరిని, ఇద్దరు పిల్లలను ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి మోచంపేటలో దించాడు. కానీ వారు మాత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న జరీనా తల్లి షేక్ ఖదిరున్నీసా చాలా సమయం వేచి చూసి.. తరువాత చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సరే ఫలితం లేకపోయింది. వాళ్ల జాడ ఎక్కడా తెలియలేదు.
చుట్టుపక్కల ఎంత వెతికినా తల్లీ, బిడ్డలు కనిపించకపోవడంతో.. కడప రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తల్లీ బిడ్డల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జరీనా వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జరీనా కనిపించకుండా పోవడానికి కారణాలు ఏమిటనే మరిన్ని విషయాలను పోలీసులు.. జరీనా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆమె చివరిగా ఎక్కడి నుంచి కనిపించకుండా పోయిందో ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను చూస్తున్నారు.
ఇవీ చదవండి: