ఉపసంహరణలోనే అసలు పరీక్ష - కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు
కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. మూడో విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. ఇక ఎవరెవరు బరిలో ఉంటారనేది ఈ రోజు తేలనుంది.

కర్నూలు జిల్లాలో మూడో విడత ఎన్నికలలో నామపత్రాల పర్వం పూర్తయింది. ముందుంది అసలు పరీక్ష అన్నట్లుంది అభ్యర్థుల పరిస్థితి. ప్రతిపక్ష పార్టీల మద్దతు, స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నవారు, రెబల్స్‌లో ఎంతమంది బరిలో ఉంటారనేది శుక్రవారం తేలనుంది. తెదేపా మద్దతుదారులు పోటీ నుంచి ఏవిధంగా ఉపసంహరించుకుంటారో అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు అధికార పార్టీ నేతలు.
పోలీసుల ఒత్తిళ్లతో అభ్యర్థులను బెదిరిస్తున్నారని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు కేఈ ప్రభాకర్ నియోజకవర్గంలోని పోలీసు అధికారుల తీరుపై ఎన్నికల కమిషనర్‌కే లేఖ రాయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే సందిగ్ధం నెలకొంది. పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తారా? లేక అభ్యర్థులను ఒత్తిడికి గురిచేసి వారి ఉద్యోగాల మీదకు తెచ్చుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు నాయకులు మాత్రం గ్రామాల్లో మన మధ్య విభేదాలు ఎందుకు మీకేం కావాలో ఆ పనులు చేస్తామంటూ బుజ్జగించే పనిలో ఉన్నారు.
మరికొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ మద్దతుతో ఇద్దరు అభ్యర్థులు రంగంలో ఉండటంతో రెండున్నరేళ్ల చొప్పున పదవి పంపకం చేపట్టే విధంగా రాజీ ప్రయత్నాలు సాగుతున్నట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సొంత నియోజకవర్గం కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలకంగా ఉండటంతో ఇక్కడ సర్పంచి ఎన్నికల తీరు ఎలా ఉండబోతుందనేది కీలకంగా మారనుంది. అభ్యర్థులపై చేస్తున్న ఒత్తిళ్లు, బుజ్జగింపులు ఎంతమాత్రం పనిచేస్తాయి, ఒత్తిళ్లకు లొంగి పోటీ నుంచి వైదొలుగుతారా, లేక అధికార పార్టీ మద్దతు అభ్యర్థులకు గట్టి పోటీగా నిలబడతారా అని వేచి చూడాల్సిన తరుణం ఆసన్నమైంది.
రహస్య ప్రాంతానికి ప్రతిపక్ష అభ్యర్థులు
డోన్‌లో పల్లెపోరు ఉత్కంఠగా మారింది. రోజురోజుకు రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. నియోజకవర్గంలోని 62 పంచాయతీల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా అధికార పార్టీ నుంచి ఒత్తిడి పెరగడం, పోలీసుల బెదిరింపులు వస్తున్నట్లు చెబుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, అభ్యర్థులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉడుములపాడులో తెదేపా మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు సమాచారం.
అభ్యర్థులను గురువారం డోన్‌లోని కేఈ స్వగృహానికి పిలిపించారు. సాయంత్రం వరకు పలువురిని ఇంటి దగ్గరే ఉంచారు. పోలీసుల ఒత్తిడి లేకుండా వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. నామపత్రాల ఉపసంహరణకు శుక్రవారం చివరిరోజు కావడంతో వారు అందుబాటులో లేకుండా ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క అధికార పార్టీ నాయకులు రెబెల్ అభ్యర్థులు ఉపసంహరించు కునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: