Mahashivratri Festival Rituals 2025 : మహా శివరాత్రి రోజున ఆ పరమ శివుడి అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు చదువుకోవాలని ప్రముఖ జ్యోతిష్యడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ మంత్రాలు జపించడం వల్ల సంవత్సరం మొత్తం శివుడి అనుగ్రహం మీపై ఉంటుందని తెలిపారు. అలాగే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
మహా శివరాత్రి రోజున ఒక్కొక్క మంత్రం జపించడం వల్ల ఒక్కో ఫలితం కలుగుతుంది. సాధారణంగా అందరూ 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రం స్మరించుకుంటారు. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. 'నమః' అంటే జీవుడు, 'శివ' అంటే పరమేశ్వరుడు అని అర్థం. 'అయ' అంటే ఈ జీవుడు పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వడం అని అర్థం. అయితే, ఒక్కొక్క ప్రయోజనం కలగాలంటే శివరాత్రి రోజున ఒక్కొక్క మంత్రం చదువుకోవాలని మంత్ర శాస్త్రంలో పేర్కొన్నారు.

జాతక దోషాలు తొలగిపోవడానికి :
జాతకంలో దోషాలు ఎక్కువగా ఉన్నవారు శివరాత్రి రోజున 'ఓం నమో భగవతే రుద్రాయ' అనే మంత్రం చదువుకోవాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు, పుష్పాలతో పూజించేటప్పుడు, ఆలయానికి వెళ్లినప్పుడు ఈ మంత్రం చదువుకోవచ్చు. దీనిని శివరాత్రి రోజున పఠించడం వల్ల గ్రహ, నక్షత్ర దోషాలు తొలగిపోతాయని మాచిరాజు తెలిపారు.
ఐశ్వర్యం కోసం :
అనేక మార్గాల్లో ధనం సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలనుకునే వారు 'శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః' అనే మంత్రం చదువుకోండి. శివరాత్రి రోజున ఈ మంత్రాన్ని చదువుకుంటూ శివపూజ చేయాలి. శివాలయానికి వెళ్లినప్పుడు కూడా ఈ మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవచ్చు.

ప్రత్యేక శ్లోకం :
శివకుటుంబం మొత్తం అనుగ్రహం పొందడానికి శివరాత్రి రోజున దీపారాధాన చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి.
"నమః శివాయ సాంబాయ సగుణాయ ససూనవే-
కైలాసాచల వాసాయ మహాదేవాయ శంభవే"
ఈ ఒక్క శ్లోకం స్మరించుకుంటే శివుడు, పార్వతి, కుమారస్వామి, గణపతి అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ చెప్పారు.
పురాణాల ప్రకారం- నల్ల కలువ పువ్వుల్లో పార్వతీ దేవి, తెల్ల కలువ పువ్వుల్లో కుమారస్వామి, కమలంలో ఈశ్వరుడు, గన్నేరు పువ్వుల్లో గణపతి కూర్చుని ఉంటాడని చెబుతుంటారు. వీలైతే శివరాత్రి రోజున నల్ల కలువ పువ్వు, తెల్ల కలువ పువ్వు, కమలం, గన్నేరు పువ్వు వంటివి శివపరివారం ఉన్న ఫొటో వద్ద ఉంచి నమస్కరించాలి. ఆపై ఈ శ్లోకం చదవాలి.
దశరుద్ర నామాలు :
శివుడికి అభిషేకం చేసేటప్పుడు నమకం, చమకం చదువుతూ అభిషేకం చేయాలని వేదంలో చెప్పారు. అయితే, ఇది సామాన్య ప్రజలకు సాధ్యం కాదు. వీరు శివరాత్రి రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు దశరుద్ర నామాలను చదువుకోవచ్చు.
- ఓం నిధన పతయే నమః - ఓం నిధన పత్యంతకాయ నమః
- ఓం ఊర్ధ్వాయ నమః - ఓం ఊర్ధ్వ లింగాయ నమః
- ఓం హిరణ్యాయ నమః - ఓం హిరణ్య లింగాయ నమః
- ఓం సువర్ణాయ నమః - ఓం సువర్ణ లింగాయ నమః
- ఓం దివ్యాయ నమః - ఓం దివ్య లింగాయ నమః
- ఓం భవాయ నమః - ఓం భవ లింగాయ నమః
- ఓం సర్వాయ నమః - ఓం సర్వ లింగాయ నమః
- ఓం శివాయ నమః - ఓం శివలింగాయ నమః
- ఓం జ్వాలాయ నమః - ఓం జ్వల లింగాయ నమః
- ఓం ఆత్మాయ నమః - ఓం ఆత్మ లింగాయ నమః
వీటిని దశరుద్ర నామాలు అని అంటారు. ఈ నామాలను సామాన్య ప్రజలు ఇంట్లో, ఆలయంలో ఎక్కడైనా శివుడికి అభిషేకం చేస్తూ చదువుకోవచ్చు. దీనివల్ల పండితులు ఆలయాల్లో అభిషేకం చేసిన ఫలితాన్ని సామాన్య ప్రజలు కూడా పొందవచ్చు. ఈ మంత్రాలు స్మరించలేనివారు 'ఓం నమః శివాయ' అని అనుకోండి. ఈ విధంగా మహా శివరాత్రి రోజున ప్రత్యేకమైన మంత్రాలను పఠించాలని మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?
మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నారా? - అవకాశం లేని వాళ్లు ఈ మంత్రం పఠిస్తే సరిపోతుందట