సోమవారం నుంచి ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్‌లో(US Open 2021) జకోవిచ్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో సమానంగా ఉన్న జకో(Djokovic US Open).. వారిని అధిగమించాలని పట్టుదలగా ఉన్నాడు. వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లతో జోరు మీదున్న ఈ టాప్ సీడ్ ఆటగాడు 'క్యాలెండర్ స్లామ్'ను(Calendar Slam) అందుకోవాలని ఉవ్విళూరుతున్నాడు. ఒక సీజన్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధిస్తే 'క్యాలెండర్ స్లామ్' అంటారు.
డాన్ బడ్జ్ (1936), మౌరీన్ కొనోలీ (1953), రాడ్ లేవర్ (1962, 1969), మార్గరెట్ కోర్ట్ (1970), స్టెఫీ గ్రాఫ్ (1988)లు మాత్రమే 'క్యాలెండర్ స్లామ్' గెలిచారు. ఫేవరెట్‌గా బరిలో దిగుతున్న జకోకు యూఎస్ ఓపెన్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డానిల్ మెద్వెదేవ్ (రష్యా), స్టెఫనోన్ సిట్సిపాస్ (గ్రీక్), ఆండీ ముర్రే (ఇంగ్లాండ్)ల నుంచి పోటీ ఎదురవ్వొచ్చు.
టోక్యో సెమీస్‌లో జకోవిచ్‌ను ఓడించిన జ్వెరెవ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాడు. గతవారం సిన్సినాటి మాస్టర్స్‌లోనూ విజేతగా నిలిచాడు. 2019 యుఎస్ ఓపెన్ రన్నరప్ మెద్వెదేవ్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ చేతిలో ఓడిన సిట్సిపాస్, గాయం నుంచి కోలుకున్న ముర్రే మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మణికట్టు గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నవొమి ఒసాకా(జపాన్) మళ్లీ టైటిల్ గెలవాలని చూస్తోంది. ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) నుంచి ఒసాకు గట్టి పోటీ ఎదురవడం ఖాయం.
ఇదీ చూడండి.. భారత్‌తో నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్ ఇదే..