Test Rankings 2022: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లోని ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన భారత్ మొదటి టెస్టు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు జడేజా. ఈ టెస్టు మ్యాచ్‌లో 175 పరుగులు సాధించిన జడేజా.. బ్యాటింగ్ జాబితాలో 17 స్థానాలు ఎగబాకాడు. 54వ స్థానంలో ఉన్న అతడు 37 స్థానానికి చేరుకున్నాడు. 9 వికెట్లు తీయడం వల్ల బౌలింగ్‌లోనూ 17వ స్థానంలో స్థిరపడ్డాడు.
ravindra jadeja: టెస్టుల్లో జడేజాకిదే అత్యధిక స్కోరు. ఏడో స్థానంలో ఓ భారత బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక పరుగులు కూడా ఇవే. కపిల్ దేవ్ 1986లో శ్రీలంకపైనే 163 పరుగులతో నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు."ఇటీవల మొహాలీలో శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత్ విజయం సాధించిన తర్వాత రవీంద్ర జడేజా ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు." అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
![icc test all rounder rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14681627_-all-rounder.jpg)
మొహాలీ ప్రదర్శనతో రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. 2021 ఫిబ్రవరి నుంచి విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు జడేజా 2017 ఆగస్టులో వారం రోజుల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానాన్ని కోల్పోయాడు. మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రెండు స్థానాలు కోల్పోయి 14 స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా అక్షర్ మొహాలీ టెస్ట్‌లో ఆడలేదు.
![icc test batting rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14681627_-batting.jpg)
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఏడో స్థానంలో ఉన్న అతడు ఐదో స్థానానికి చేరుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. రిషభ్ పంత్ 96 పరుగుల ప్రదర్శనతో టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూచనే అగ్రస్థానంలో ఉన్నాడు.
![icc test bowling rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14681627_-bowler.jpg)
బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో, బుమ్రా పదో స్థానంలో నిలకడగా కొనసాగుతున్నారు. ప్యాట్ కమిన్స్ టేబుల్ టాప్‌లో ఉన్నాడు.
ఇదీ చదవండి: IPL 2022: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు వీరే!